ధరణి పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రెండు లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ దందాలో రెవెన్యూ మంత్రిగా కేసీఆర్, ఐటీ మంత్రిగా కేటీఆర్ భాగస్వాములని ఆరోపించారు. ఈ కుంభకోణంపై రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు న్యాయవిచారణ చేయించడం లేదని ప్రశ్నించారు.
గతంలో రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి ఉంటే ప్రస్తుతం అది ఆరు లక్షల ఎకరాలకు పడిపోయిందని, మిగతా 18 లక్షల ఎకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు విచారణ చేయించడం లేదన్నారు. 65 వేల ఎకరాల దేవాదాయ భూములు మాయమయ్యాయని చెప్పారు.
తనకు మంత్రి పదవి ఇవ్వడానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కాదన్నారు. పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో లేకున్నా అదే పార్టీలో కొనసాగానని, తప్పని పరిస్థితుల్లోనే బయటికి వచ్చానని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి దిగిపోయారని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు కూడా వారానికి రూ వెయ్యి కోట్ల అప్పు చేస్తోందని అన్నారు.