ధరణితో రైతులకు మేలే జరిగింది

ధరణితో రైతులకు మేలే జరిగింది
  • 5 శాతం మందే ఇబ్బంది పడ్డరు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్​తో ఎంతో మంది రైతులకు మేలు జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. 95శాతం మంది రైతులకు న్యాయం జరిగిందని, కొన్ని కారణాలతో 5శాతం మంది రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. పోర్టల్ వైఫల్యాలను కేసీఆర్ కు ఆపాదించడం సరికాదన్నారు. ఎంతో మంది అధికారులు, మేధావులతో కలిసి చర్చించి కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారని తెలిపారు. 

శుక్రవారం అసెంబ్లీలో కొత్త ఆర్వోఆర్ చట్టంపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున పల్లా మాట్లాడారు. ‘‘కేసీఆర్, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఓ రూమ్​లో కూర్చొని ధరణిని రూపొందించారంటూ మంత్రి పొంగులేటి అనడం సరికాదు. ఇద్దరి వల్ల 30లక్షల మంది రైతులు ఇబ్బందులుపడ్తున్నారన్న ఆయన కామెంట్లను ఖండిస్తున్నాం. అందరితో చర్చించిన తర్వాతే ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. ధరణి అంటేనే కాంగ్రెసోళ్లకు కేసీఆర్ గుర్తుకొస్తున్నరు. 

అందుకే ఆ పేరు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది’’అని అన్నారు. ధరణిలోని పార్ట్ ఏలో వివాదాల్లేని భూములను పొందుపర్చామన్నారు. ఇందులోనే 90శాతం భూములు ఉన్నాయని తెలిపారు. 18లక్షల ఎకరాలను రకరకాల కారణాలతో పార్ట్ బీలో ఉంచారని చెప్పారు. భూముల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేశామన్నారు.