యాదాద్రి, వెలుగు: బంగారు తెలంగాణ పేరుతో మోసం చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్పెద్ద దొంగ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఒక్క రాజగోపాల్‌రెడ్డిని ఎదుర్కోవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు రాబందుల్లా, గద్దల్లా మునుగోడు మీద పడ్డారని ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంంలో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు, మసీదు గూడెంలో కోమటిరెడ్డి లక్ష్మి, గూడూరు నారాయణరెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్తన కూతురు కవితను కాపాడుకోవడానికే ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. ఈడీ తమ మీద దాడులు చేయాలని కేటీఆర్ కోరుకుంటున్నట్టుగా కనబడుతోందన్నారు. ధరణి పేరుతో లక్షల కోట్ల విలువైన భూములను కేసీఆర్ కుటుంబం కబ్జా చేసిందని, బీజేపీ అధికారంలోకి రాగానే ధరణిని తొలగిస్తామన్నారు. గజ్వేల్, సిద్దిపేటకు వందల కోట్లు ఇచ్చిన కేసీఆర్..మునుగోడుకు రూ.రెండు కోట్లే ఇచ్చి వివక్ష చూపారని ఆరోపించారు. ఎనిమిదేండ్లుగా నిధులివ్వకుండా ఇప్పుడు దత్తత తీసుకుంటాని కేటీఆర్ అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మీద విశ్వాసం లేకే 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లారన్నారు. కాంగ్రెస్‌కు పోరాటం చేసే శక్తి లేదని, పూర్తిగా బలహీన పడిందన్నారు.
ఇండ్లు కట్టిస్తా.. రోడ్లు వేయిస్తా
సీఎం కేసీఆర్ పక్షపాతం కారణంగా మునుగోడును రాజగోపాల్‌రెడ్డి అభివృద్ధి చేయలేకపోయాడని కోమటిరెడ్డి లక్ష్మి అన్నారు. ఎన్నికలు అయిపోగానే ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు కట్టిస్తామని, రోడ్లు వేయిస్తానని రాజగోపాల్‌రెడ్డి తరపున హామీ ఇస్తున్నానన్నారు. టీఆర్ఎస్ ఓడితే పింఛన్లు ఆగిపోతాయని విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.