
- వివిధ డిపార్ట్మెంట్లతో ముగిసిన కమిటీ మీటింగ్స్
- పోర్టల్‌లో చేయాల్సిన తక్షణ మార్పులు, గల్లంతైన భూములు,
- పెండింగ్ అప్లికేషన్ల సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్‌పై ఏర్పాటు చేసిన కమిటీ వారం, పది రోజుల్లోనే మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు నివేదిక తయారీని మొదలుపెట్టింది. ఇప్పటికే వివిధ డిపార్ట్మెంట్లు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశమై సమగ్రంగా చర్చించిన కమిటీ.. తక్షణ సమస్యల పరిష్కారానికి రిపోర్ట్‌ను అందజేయనున్నట్లు తెలిసింది. ముందుగా ధరణి పోర్టల్‌లో ఉన్న మాడ్యుల్స్లో చేయాల్సిన మార్పుల గురించి రెకమండ్ చేయనుంది. అటు అధికారులకు, ఇటు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి వివరాలు పోర్టల్‌లో నిక్షిప్తమై ఉండేలా మార్పులను సూచించనుంది.
ధరణి పోర్టల్ లో ప్రతి ఏడాది ఆన్లైన్ పహాణీ అప్డేట్ చేయడంతో పాటు మ్యానువల్గాను రికార్డు ఉండేలా సిఫార్సు చేయనుంది. దీంతో పాటు ప్రస్తుతం ధరణిలో వివిధ సమస్యలపై వచ్చిన అప్లికేషన్లు ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? వాటిలో ఎక్కువ సంఖ్యలో ఏమేమి వచ్చాయో వాటి పరిష్కారానికి అవసరమైన సిఫార్సులు చేయనుంది.
మిస్సింగ్ సర్వే నంబర్లు, మిస్సింగ్ ఎక్స్టెంట్ తో పాటు భూములకు సంబంధించిన గ్రీవియెన్స్ రిలేటెడ్ మ్యాటర్స్, మ్యుటేషన్, సక్సెషన్లు, ఇతర భూ సమస్యలపై వచ్చిన అప్లికేషన్స్ అన్నింటిని పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రోగ్రామ్ తీసుకోవాలని సూచన చేయనున్నట్లు తెలిసింది. పోర్టల్ నిర్వహణ ప్రైవేట్ కంపెనీ నుంచి తీసి.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడం, సర్వే సెటిల్‌మెంట్, దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డు, ఫారెస్ట్ ల్యాండ్స్‌కు సంబంధించి ధరణిలో నమోదు కాని భూములను తిరిగి రికార్డులోకి తీసుకురావడం దానిపై ప్రభుత్వానికి కీలక సూచనలు చేయనుట్లు తెలిసింది.
నిషేధిత జాబితాలో ఉన్న భూములు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కు ధరణి పోర్టల్‌ను ఎలా లింక్ చేయాలనే దానిపైనా కూడా కమిటీ రెకమండేషన్స్ ఇవ్వనుంది. ఈ వారంలో ఒకరోజు జిల్లా స్థాయిలో పర్యటన చేసే యోచనలో కూడా కమిటీ సభ్యులు ఉన్నారు. లేదా మధ్యంతర నివేదికను అందించిన తరువాత పూర్తి స్థాయి రిపోర్ట్ కోసం ఫిల్డ్ విజిట్ చేయనుంది.