
జీవితాన్ని అసమానతలు రూపుమాపేందుకు, పేదవర్గాల ఉద్ధరణ, సామాజిక న్యాయం కోసం అంకితం చేసిన మహనీయుడు ధర్మభిక్షం. ఆయన పోరాటం, నిస్వార్థ సమాజ సేవ నేటి రాజకీయ నాయకులకు, యువతకు గొప్ప స్ఫూర్తి పాఠం. 2011 మార్చి 26న ఆయన మన నుంచి దూరం అయ్యారు. బుధవారం(నేడు) ఆయన 14 వర్ధంతి. విద్యార్థి దశలోనే నిజాంను ఎదిరించిన ఆయన కమ్యూనిస్టు యోధుడిగా, రాజకీయ నేతగా అందించిన సేవలు చిరస్మరణీయం.
ధర్మభిక్షంగా మారిన భిక్షం
ధర్మభిక్షం బడిలో చదువుతున్న రోజుల్లోనే అప్పటి పాలకుడు నిజాంను ఎదిరించారు. నిజాం రాజు జన్మదిన వేడుకలు(సిల్వర్ జూబ్లీ వేడుక) స్కూళ్లలో ఘనంగా జరపాలని ఇచ్చిన ఫర్మానాను ధిక్కరించి వాటిని బహిష్కరించాడు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో దేశవ్యాప్తంగా ఎగసిన వందేమాతర ఉద్యమంలో ఒక నిప్పుకణంగా జ్వలించారు. సూర్యాపేటలో విద్యార్థుల కోసం హాస్టల్ నడిపి విద్య, సామాజిక సంస్కరణలను ప్రోత్సహించారు.
హాస్టల్ వార్షికోత్సవాలకు హాజరైన అప్పటి హైదరాబాద్ కొత్వాల్ రాజ బహద్దూర్ వెంకటరాంరెడ్డి.. విద్యను ధర్మం చేస్తున్నందుకు అప్పటివరకూ భిక్షంగా ఉన్న పేరును ధర్మభిక్షంగా పేర్కొన్నారు. దీంతో నాటి నుంచి ఆయన్నిఅందరూ ధర్మభిక్షం అని పిలిచారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. నిజాం రాజ్యంలో రైతులు, కార్మికులపై జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ పోరాటంలో భాగంగా ఆయన ఐదున్నరేండ్లు
జైలుశిక్ష అనుభవించారు.
కార్మికులు కోసం ఉద్యమాలు
కార్మికుల హక్కుల కోసం ధర్మభిక్షం అలుపెరగని పోరాటం చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో లక్ష మంది కార్మికులతో చారిత్రాత్మక సమ్మె నిర్వహించారు. వారికి కూలీ పెంపు, అందాల్సిన సౌలత్లు సాధించారు. అలాగే గీత కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ గీత పనివార్ల సంఘాన్ని స్థాపించారు.
ఇది 50 ఏండ్లకుపైగా చరిత్ర కలిగిన సంఘం. గీత వృత్తిని శాస్త్రీయంగా డెవలప్ చేసి, తాటి, ఈత చెట్ల నీరా నుంచి చక్కెర, బెల్లం, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ వంటి ఉత్పత్తులను తయారు చేయాలని, వాటి ఉత్పత్తిని గ్రామీణ పరిశ్రమగా మార్చాలని కలలు కన్నారు. తాటి, ఈత చెట్లు ఎక్కుతూ కింది పడిపోయి చనిపోయిన, దివ్యాంగులుగా మారిన గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా సాధించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.
జర్నలిస్టుగా, క్రీడాకారుడిగా..
తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అద్భుతమైన వక్తగా పేరుగాంచిన ధర్మభిక్షం, స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో జర్నలిస్టుగా కూడా పనిచేశారు. ‘మీజాన్’, ‘రయ్యత్’, ‘గోల్కొండ’ పత్రికలకు తన రచనలు అందించారు. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు హాకీ జట్టు కెప్టెన్‌గా కొనసాగారు. రాజకీయ జీవితం, ఆశయాలు రష్యా విప్లవ స్ఫూర్తి, గోర్కి రాసిన అమ్మ నవల బలమైన ప్రభావంతో ధర్మభిక్షం 1942లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు.
నల్గొండ జిల్లా ప్రజలు ఆయనను మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించారు. ధర్మభిక్షం ఆశయాలు సమానత్వ సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నాయి. అధికార వికేంద్రీకరణ ఉండాలనేది ఆయన ప్రధాన ఆశయం. సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఉండకూడదని, సోదరభావం ఉండాలని భావించారు.
రాజకీయ అధికారాన్ని ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలని, అది కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదని ఆయన గట్టిగా నమ్మారు. ఈ ఆశయాలే ఆయన్ను ప్రజలకు తమవాడిగా మార్చాయి. ఒక లీడర్‌గా, సమాజ సేవకుడిగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన ఆయన నేటితరానికి ఒక గొప్ప మార్గదర్శి.
-బాదిని ఉపేందర్,సీనియర్ జర్నలిస్ట్-