రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా

రంగారెడ్డి, వెలుగు: ఇండ్లు లేని పేదలకు వెంటనే ఇండ్ల స్థలాలు, అర్హులకు డబుల్​ బెడ్రూంలు ఇవ్వాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మా నాయక్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక, రంగారెడ్డి జిల్లా కమిటీ అధ్వర్యంలో సోమవారం ముట్టడించాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు, నాయకులు గేట్ ముందు బైఠాయించారు. ఆపై ప్రజా సంఘాల నాయకులు అడిషనల్ కలెక్టర్ తిరుపతి రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధర్మా నాయక్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరీ అయిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ జరగలేదని, అర్హులైన పేదలకు వెంటనే ఇవ్వాలన్నారు. చాలా చోట్ల ఇంకా టెండర్లు కూడా కాలేదన్నారు. 

పేదలు గుడిసెలు వేసుకున్న చోట వారికి హక్కులు కల్పించాలని కోరారు. జిల్లాలో రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలన్నారు. పెన్షన్ కోసం 23 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయని, వారికి వెంటనే పెన్షన్ అందేలా చూడాలన్నారు. ధరణితోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పగడాల యాదయ్య, భాస్కర్, మధుసూదన్ రెడ్డి, చంద్రమోహన్, జగన్, సుమలత తదితరులు పాల్గొన్నారు.