తెలంగాణ రైల్వే ఉద్యోగుల ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష

తెలంగాణ రైల్వే ఉద్యోగుల ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష

కాజీపేట, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కాజీపేటకు శాంక్షన్ చేసిన రైల్వే పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీవోహెచ్) వర్క్ షాప్ కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్థలాన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మ పోరాట దీక్ష కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమానికి రైల్వే ఉద్యోగ సంఘాల నేతలతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ,  రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్​ రెడ్డి, కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి, స్థానిక బీఆర్ ఎస్ నేతలు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్థలం కేటాయించకపోవడంపై రాకేశ్​ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ, రాష్ర్ట ప్రభుత్వం అలసత్వం చేయడం వల్లే  పనులు ప్రారంభం కావడం లేదన్నారు.  దీంతో  స్థానిక బీఆర్ఎస్ నేతలు రాకేశ్​రెడ్డి మాట్లాడుతుండగానే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని, వర్క్​ షాప్​ ఏర్పాటు విషయంలో రెండు పార్టీలు  ప్రజలను మోసం చేస్తున్నాయంటూ విమర్శించడంతో మూడు పార్టీల మధ్య వాగ్వాదం పెరిగింది.  అన్ని పార్టీల కార్యకర్తలు ఎవరికీ వారు అనుకూల నినాదాలు చేసుకుంటూ తోపులాటకు దిగడంతో  ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  పోలీసులు వచ్చి అన్ని పార్టీల నాయకులకు నచ్చజెప్పి దీక్షా కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేసి పంపించివేశారు.  ఈసందర్భంగా  బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మీడియాతో మాట్లాడుతూ..  బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు రెండు దొందూ దొందేనని, ఉన్నది ఉన్నట్టు అంటే ఆ రెండు పార్టీల నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారంటూ ప్రశ్నించారు. కాజీపేట రైల్వే అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.