- ధర్మ సమాజ్ పార్టీ చీఫ్ విశారదన్
నల్గొండ అర్బన్/మిర్యాలగూడ, వెలుగు : ఓటును అమ్ముకుంటే రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అవుతుందని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. రెడ్డి, వెలమ, కమ్మ సామాజికవర్గాల వారి ఓట్లు తాము అడగబోమని, అలాగే తమ ఓట్లను ఆ సామాజికవర్గం నేతలు అడగరాదని ఆయన సూచించారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ లో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగంలో స్థానం లేనప్పుడు తమ ఓట్లు ఎందుకని నిలదీశారు. రాజ్యంలో తమకూ వాటా కావాలని, అప్పుడే అగ్రవర్ణాల్లోని పేదలను తమతో సమానంగా చూసుకుంటామన్నారు.
రాజ్యాధికారాన్ని సాధించి తమ బిడ్డలకు ఆస్తిగా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘తెలంగాణ సంపద మొత్తం మూడు, నాలుగు కులాల వద్ద బందీ అయిపోయింది. 90 శాతం ఉన్న బడుగుబలహీన వర్గాలు ఇంకా కూలి పనులు చేసుకుని బతుకుతున్నారు. శ్రామికుల దగ్గర సంపద లేకున్నా ఓటు అనే ఆయుధం ఉంది. మన ఓట్లు మనమే వేసుకుంటే రాజ్యాధికారం వస్తుంది” అని విశారదన్ తెలిపారు. నల్గొండలో తమ పార్టీ అభ్యర్థిగా పుల్లెంల శంకరయ్యను నిలబెట్టామని, ఆయనను గెలిపించాలని ఓటర్లకు విశారదన్ విజ్ఞప్తి చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజకీయంగా వెనుకబడ్డారు
రాష్ట్రంలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు రాజకీయంగా వెనకబడ్డారని, వారికి రాజ్యాధికారం సాధించేందుకే తాము ఎన్నికల బరిలో నిలిచామని విశారదన్ మహరాజ్ అన్నారు. శనివారం మిర్యాలగూడలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలంటే పండుగ కాదని, అట్టడుగు వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు దక్కే సువర్ణ అవకాశమని తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ధర్మ సమాజ్ పార్టీ తరపున పోటీచేస్తున్న తమ అభ్యర్థి తరి యల్లయ్యను గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు.