కాన్షీరాం స్ఫూర్తితో ధర్మ సమాజ్​పార్టీ

ప్రజాప్రాతినిథ్య ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఆయా సామాజిక వర్గాలు ఎంత శాతం ఉంటే ఆ మేరకు వాళ్లకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కాలి. అప్పుడే వాళ్లు యాచించే వాళ్లుగా ఉండక.. శాసించే స్థాయికి ఎదుగుతారు. అదే నిజమైన సామాజిక న్యాయం. కానీ  తెలంగాణలో బహుజనులకు సామాజిక న్యాయం పూర్తి స్థాయిలో అందడం లేదు. స్వపరిపాలన అంటే ఒక ఆధిపత్య వర్గం పోయి.. ఇంకో ఆధిపత్య వర్గం రావడం కాదు. రాష్ట్రం ఏర్పడితే మాకు కూడా పరిపాలనలో వాటా వస్తుందని చిన్న చిన్న సామాజిక వర్గాలు కూడా జేఏసీలు ఏర్పాటు చేసుకొని ఉద్యమించాయి. కానీ వారికి పాలనలో వాటా దక్కడం లేదు. జనాభాలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం కొట్లాడి భారతదేశ రాజకీయ వ్యవస్థలో సరికొత్త చరిత్రను నిర్మించిన వ్యక్తి కాన్షీరాం. 

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా కాన్షీరాం పోరాట మార్గాన్ని ఎంచుకొని సామాజిక, సాంస్కృతిక ఉద్యమం చేస్తూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్య స్థాపనకు కృషి చేస్తున్నారు విశారదన్ మహారాజ్. ఆయన రాష్ట్రంలో చేసిన పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ఏప్రిల్ 30న ముగిసింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అగ్రవర్ణాలు, దొరల పాలనలో 90 శాతం వాటా కలిగిన బీసీ, ఎస్సీ ఎస్టీలు ఎందుకు దోపిడీకి గురికావాల్సి వస్తోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎందుకు తమ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవద్దని ఆయన పాదయాత్రలో ప్రజలను ఆలోచింపజేశారు. నాడు ఉత్తరప్రదేశ్ లో చమర్ కులస్తుల కేంద్రంగా, చమర్ ల నాయకత్వంలో సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించి బహుజన సమాజ్ పార్టీని పెట్టి ఎస్సీలకు తోడుగా బీసీ, ఎస్టీలను కలుపుకొని ఉత్తర ప్రదేశ్ లో బహుజన రాజ్యాధికారం తెచ్చారు కాన్షీరాం. దాదాపు 20 ఏండ్లు సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపించి అణగారిన కులాల రాజ్యాధికారానికి రాజకీయేతర ఉద్యమం ముఖ్యమని భావించి బహుజన సమాజానికి రాజకీయాలు ఏ విధంగా చేయాలో నేర్పిన రాజకీయ ఉద్దండుడు ఆయన. ఆయన నుంచే రాజకీయ శిష్యరికం చేసిన విశారదన్ మహారాజ్ హైకోర్టు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి, కాన్షీరాం ఉద్యమంపై, బహుజన సమాజ్ పార్టీ పైన పీహెచ్డీ చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాన్ని నిర్మించాలని దృఢ సంకల్పం తీసుకున్నారు విశారదన్ మహారాజ్. గత13 ఏండ్లుగా తెలంగాణలో బహుజనుల్లో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక మార్పులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

మన ఓటు మన ప్రభుత్వం నినాదంతో

రాష్ట్రంలో విశారదన్ మహారాజ్ పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రలో భాగంగా హమారా వోట్ హమారా సర్కార్(మన ఓటు – మన ప్రభుత్వం) అనే నినాదంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారంపై చైతన్యం తీసుకువస్తున్నారు. అగ్రకుల నాయకులు బీసీ, ఎస్సీ, ఎస్టీలను కార్యకర్తలుగా వాడుకుని అట్టడుగు కులాల శక్తితో రాజ్యం ఏలుతున్నారని, అందుకే  తెలంగాణ రాష్ట్రంలో అణగారిన ప్రజల సకల సమస్యల విముక్తికి పూలే, అంబేద్కర్, కాన్షీరాంల మార్గమే శరణ్యం అని విశారదన్​మహారాజ్​ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మొన్న ఏప్రిల్ 30 న హైదరాబాద్ లోని సరూర్ నగర్ క్రీడా మైదానంలో కాన్షీరాం రణస్థలం పేరుతో భారీ బహిరంగ సమావేశంలో పాదయాత్ర ముగింపు సభ నిర్వహించి అదే సభలో 13 సంత్సరాలు అణగారిన కులాలని సామాజికంగా, సాంస్కృతికంగా రాజకీయేతర ఉద్యమంగా ఉన్న డీఎస్పీని ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయడమే లక్ష్యంగా ‘ధర్మ సమాజ్ పార్టీ’ అనే ఒక నూతన రాజకీయ పార్టీగా విశారదన్ మహారాజ్ ప్రకటించారు. 

మొదటగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా విజయం సాధించి, సామాజిక, రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక పరంగా విప్లవాత్మక, గుణాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. మిగతా రాష్ట్రాల్లో కూడా డీఎస్పీని విస్తరించి బహుజనులకు రాజ్యాధికారం దగ్గర చేయాలని ఆయన కాంక్షిస్తున్నారు. బహుజనులారా ఇంకెన్నాళ్లు పాలితులుగా ఉందాం.. చైతన్యమవుదాం.. కాన్షీరాం స్ఫూర్తితో రాజ్యాధికారం కోసం పోరాటం చేద్దాం.


- పుల్లెంల గణేష్