- రెవెన్యూ అధికారులకు ధర్మన్నగూడ రైతుల వేడుకోలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: తమకు చెందిన 70 ఎకరాల భూమిని కాపాడాలని యాచారం మండలంలోని ధర్మన్నగూడ గ్రామస్తులు కోరారు. మంగళవారం రెవెన్యూ అధికారులను కలిసి వేడుకున్నారు. గ్రామానికి చెందిన 35 పేద రైతు కుటుంబాలు 1991లో గ్రామానికి చెందిన రాజిరెడ్డి కుటుంబం దగ్గర భూమిని కొనుగోలు చేశాయి. రైతులు కొన్న కొద్ది రోజులకే రాజిరెడ్డి మరణించగా.. రాజిరెడ్డి కొడుకు, తమ్ముళ్లు అప్పటి నుంచి పట్టా చేయలేదు. సాదాబైనామాకు అప్లికేషన్లు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. తమకు న్యాయం చేయాలని మండల తహసీల్దార్‌ను రైతులు పలుమార్లు కలిసి వినతి పత్రాలు అందించారు. అయినప్పటికీ పట్టాలు చేసేది లేదంటూ రాజిరెడ్డి కుటుంబ సభ్యులు రైతులను బెదిరించారు.
దీంతో ఇటీవల రైతులంతా రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిని కలిసి సమస్యను పరిష్కరించాలని కోరారు. స్పందించిన కోదండరెడ్డి.. వెంటనే మండల తహసీల్దార్ తో ఫోన్‌లో మాట్లాడి రైతుల సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అయితే రైతులకు తెలియకుండా 15 రోజుల కింద రాజిరెడ్డి కొడుకు, తమ్ముళ్లు పట్టా చేయించుకున్నారు. దీనిపై రైతులు మంగళవారం అధికారులను కలిశారు.