
- టైమ్ వచ్చినప్పుడు కేటీఆర్ అరెస్టు తప్పదని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: హెచ్‌సీయూ భూముల వెనుక బీజేపీ ఎంపీ ఉన్నారని చెబుతున్న కేటీఆర్.. దమ్ముంటే ఆ పేరు బయటపెట్టాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సవాల్ విసిరారు. ఆ భూముల మీద ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ ఇచ్చిందని చెబుతున్నారని, లోన్ ఇచ్చినందుకు ముందుగా బ్యాంక్ వాళ్లను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో అర్వింద్ మాట్లాడారు.
హెచ్‌సీయూ భూముల అంశంపై కేటీఆర్, కవితకు మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు హెచ్‌సీయూకు భూములు ఎందుకు బదలాయించలేదని ప్రశ్నించారు. ‘‘లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ ఎప్పుడు అని చాలామంది లక్షల సార్లు ప్రశ్నించారు. చివరకు కవిత అరెస్ట్ అయింది. జన్వాడ ఫామ్‌హౌస్‌పై డ్రోన్ ఎగురవేసిన కేసులో గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా జైలుకు వెళ్లారు.
సమయం వచ్చినప్పుడు కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతారు” అని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ ఫామ్‌హౌస్‌లో ఉండే కేసీఆర్ ప్రతిపక్ష నేత ఎట్లయితరని ప్రశ్నించారు. ‘‘కష్టాలు ఎదురైనప్పుడు ప్రజలు పిలిస్తే కేసీఆర్ వస్తారని బీఆర్ఎస్ నేతలు చెప్తుండడం సిగ్గుచేటు. అంటే ప్రజల బతుకులు బర్బాత్ అయితేనే కేసీఆర్ బయటకు వస్తారా? ప్రజలు ఆయనను పిలవరు. అసలు గుర్తుకూడా పెట్టుకోరు” అని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పవన్ కల్యాణ్‌పై మాట్లాడే అర్హత లేదని, ఆమెకు ఎన్నికల్లో నిలబడే ముఖమే లేదని విమర్శించారు.
మంత్రులంతా దోచుకుంటున్నరు..
హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి రోజుకో అంశం తెరమీదికి తీసుకొస్తున్నారని అర్వింద్ మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీని కాలు పెట్టనివ్వబోమని సీఎం అంటున్నారని.. కానీ లేటెస్ట్‌గానే మల్క కొమరయ్య, అంజిరెడ్డి కాలు పెట్టారన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డిని మార్చాలని కాంగ్రెస్ హైకండ్ చూస్తున్నది. కానీ పార్టీలో ఒక్కరూ ఫిట్ అయ్యే క్యాండిడేట్ లేరు. సీఎంగా ఫిట్ అయ్యే వ్యక్తి ఒక్క శ్రీధర్ బాబు మాత్రమే.
అయితే ఆయనకు రేవంత్‌లాగా సీసీపీయూ (కలెక్షన్, కరప్షన్, పే అండ్ యూజ్) కోర్సు చేయరాదు. అది ఉంటేనే కాంగ్రెస్‌లో ఎలిజిబులిటీ” అని వ్యాఖ్యానించారు. కలెక్షన్‌లో సీఎంతో మంత్రి పొంగులేటి పోటీ పడ్డారని, అందుకే ఆయనను పక్కన పెట్టారన్నారు. రాష్ట్రంలో మంత్రులంతా ఎగబడి దోచుకుంటున్నారని ఆరోపించారు. 2018లోనే బీఆర్ఎస్ ఓడిపోవాల్సిందని, కానీ ఉత్తమ్ అమ్ముడుపోవడంతోనే ఆ పార్టీ గెలిచిందన్నారు. ముస్లిం ఏరియాలకు బుల్డోజర్లను పంపే దమ్ము సీఎంకి ఉందా? అని సవాల్ విసిరారు.