ఎన్నికలు రాకముందే టీఆర్ఎస్ ఖతమైంది: అర్వింద్

ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ ఖతమైందని ఎంపీ  ధర్మపురి అరవింద్  అన్నారు. హామీల అమల్లో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పెట్టారన్నారు.  కరీంనగర్ లో బండి సంజయ్ ఐదో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో అరవింద్  మాట్లాడారు.  బీఆర్ఎస్ కు సిద్దాంతం, ఎజెండా అంటూ ఏమీ లేదని, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకే బీఆర్ఎస్ ఏర్పాటని ఆరోపించారు. ఈ విషయం కార్యకర్తలకు తెలిసింది కానీ..నాయకులే మేల్కోవాలన్నారు.  తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ సీట్లు, టికెట్లు కూడా కేసీఆరే డిసైడ్ చేస్తారని విమర్శించారు.

బీఆర్ఎస్ తో కేసీఆర్... దేశమంతా తిరుగుతూ కేటీఆర్ కు రాష్ట్రం అప్పగిస్తాడట.. సినీ నటులతో, రాత్రి మ్యూజిక్ లు వినడం తప్ప కేటీఆర్ ప్రజల్లోకి రాడని అరవింద్ అన్నారు.  ఇక మొన్నటి దాకా తనని వేటాడి, వెంటాడ ఓడిస్తానన్న కవిత.. ఇప్పుడు తన తండ్రి చెప్పిన చోట పోటీ చేస్తుందట..  కవిత  తన మీద పోటీ చేయాలని,  దైర్యం లేకపోతే కేసీఆర్ ను ఇందూరు నుంచి పోటీకి దిగామని చెప్పాలని అరవింద్  డిమాండ్ చేశారు. బీజేపీ వస్తేనే అవినీతి రహిత పాలన వస్తుందని, డబుల్ ఇంజన్ సర్కారు లక్ష్యంగా పని చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.