మెట్ పల్లి, వెలుగు: రాష్ట్రంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీల భూముల అమ్మకానికి కుట్రలు మొదలయ్యాయని కోరు ట్ల అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఫ్యాక్టరీల భూములను ప్లాట్లు చేసి అమ్మేందుకు పర్మిషన్ ఇవ్వాలని ప్రైవేటు యాజమాన్యం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని, దానికి గవర్నమెంట్ కు సం బంధించిన డైరెక్టర్లు సైతం అంగీకారం తెలిపినట్టు తెలిసిందన్నారు. శనివారం మెట్ పల్లిలో అర్వింద్ మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ పదేండ్లుగా షుగర్ ఫ్యాక్టరీల ఇష్యూ ను పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ భూములు అమ్మి రైతుల పొట్టకొట్టే ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. బీజేపీకి అధికారం ఇస్తే.. షుగర్ ఫ్యాక్టరీలు రీ ఓపెన్ చేస్తామని భరోసా ఇచ్చారు.
సీఎం కేసీఆర్ కు గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్లా ఓటమి తప్పదని అర్వింద్ తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలుకెళ్లడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాతకాలం పార్టీ అని.. ఆ పార్టీ వల్ల దేశానికి, ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. 20న మెట్ పల్లి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారని చెప్పారు.