పదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు..యువకులను తాగుబోతులుగా తయారు చేశారు : అర్వింద్

పదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు..యువకులను తాగుబోతులుగా తయారు చేశారు : అర్వింద్

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బతికున్న వాడికి ఆరోగ్య బీమా లేదు గానీ.. చచ్చిన వాడికి మాత్రం ఐదు లక్షల బీమా ఇస్తారట అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బతుకున్నోడికి ఇల్లు వద్దు గానీ.. సచ్చినోడికి అందమైన వైకుంఠధామాలు కావాలా..? అని ప్రశ్నించారు. తాగుబోతు ప్రభుత్వాన్ని నడిపితే ఇలాగే ఉంటుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్ హయంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా సమయంలో 22 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా ఇచ్చాడని చెప్పారు. మూడు సంవత్సరాల నుండి రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తున్నామన్నారు. మరో ఐదేళ్లు కూడా ఇస్తామని మోడీ ప్రకటించారని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, చిరు వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధికి రుణాలు ఇవ్వడం లేదన్నారు. 

యువతను మాత్రం తాగుబోతులుగా తయారు చేశారని ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఎన్ఆర్ఐ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి గల్ఫ్ లో ఎవరైనా చనిపోతే లక్షల బీమా ఇస్తామన్నారు. దుబాయ్, సౌదీలలో తెలంగాణ భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు.