కేసీఆర్ ఘోరంగా ఓడిపోతున్నారు : ధర్మపురి అర్వింద్

తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన, కుటుంబ పాలన నడుస్తోందని కోరుట్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. రాష్ర్టంలో కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని చెప్పారు. ప్రైవేట్ యాజమాన్యం చక్కెర కర్మాగారం భూములను ప్లాట్లు చేసి.. అమ్మడానికి సిద్ధపడి సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉండే డైరెక్టర్లు కూడా అంగీకరించినట్లుగా తమకు సమాచారం ఉందని చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమని, అందుకే సీఎం కేసీఆర్ కోరుట్ల సభలో ఫ్యాక్టరీ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిర్వహించిన ప్రెస్మీట్లో అర్వింద్ ఈ కామెంట్స్ చేశారు. 

చెరుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అర్వింద్ భరోసా ఇచ్చారు. వ్యవసాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలోని చెరుకు రైతులందరూ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నవంబర్ 20వ తేదీన 11 గంటలకు మెట్ పల్లి మినీ స్టేడియంలో జరిగే బీజేపీ సభను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ నుండి నాయకులు వెళ్లిపోయినా.. పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు అర్వింద్. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎవరు గెలిచినా ఆ పార్టీల్లో ఉండరని చెప్పారు. కేసీఆర్ ఘోరంగా ఓడిపోతున్నారని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవితల కొట్లాట చూస్తామని చెప్పారు. మెట్ పల్లిలో ఇల్లు, పొలం కొని.. ఇక్కడే ఉంటానని, అవసరం అనుకుంటే చెరుకు, పసుపు పంట సాగు చేస్తానని చెప్పారు.