బోధన్, వెలుగు: హిందూ సంస్కృతి, సంప్రదాయాలను వ్యతిరేకించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. అలాంటి పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. బోధన్ టౌన్‌లోని ఏకచక్రేశ్వర గోశాలను సందర్శించిన ఆయన గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయంలో గోమాత ఎంతో పవిత్రమైందని, సమాజసేవ, గోమాత సేవలు సేవచేసేవారిని ఎంతకొనియాడినా తక్కువేనన్నారు.
500 యేండ్ల పోరాటం తర్వాత అయోధ్యకు బాలరాముడు రావడం శుభ సూచికమన్నారు. బోధన్ లోని 10వ శతాబ్దానికి చెందిన ఇంద్రనారాయణ దేవాలయాన్ని కొందరు వేరే మతస్తులు కూల్చేశారన్నారు. బోధన్ లో శివాజీ విగ్రహం పెట్టడానికి ప్రయత్నిస్తే, అనేక అడ్డంకులు సృష్టించారన్నారు. బీజేపీని ఆదరించి లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు మోహన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి సుధాకర్‌చారి, బీజేపీ ఫ్లోర్‌లీడర్ వినోద్, గోశాల కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.