సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు డొల్ల మాటలు చెబుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడానికే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి.. మునుగోడులో ఉపఎన్నిక వచ్చేలా చేశారని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడులో బీజేపీ నిర్వహించిన రోడ్ షో లో అరవింద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు... కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ హిట్లల్ లెక్క పాలన చేస్తుండని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎక్కడికిపోయనా తెలంగాణ సాధించి 9 ఏళ్లు గడిచిందని చెప్పుకుంటున్నారు కాని.. రాష్ట్రంలో అభివృద్ధిని శూన్యం చేశారని అరవింద్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను భ్రష్టు పట్టించారని అరవింద్ అన్నారు. ధరణి పోర్టల్ పేరుతో రైతులను ఆగమానం చేశారన్నారు. మూసీ ప్రక్షాళన కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ కుటుంబం మింగేసిందని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్, కవిత కలిసి డ్రగ్స్, గంజాయి దందాలు చేస్తున్నారని.. ఆ లెక్కలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. రాష్ట్రంలో మోడీ నాయకత్వాన్ని బలపర్చడానికి.. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను ఎంపీ అరవింద్ అభ్యర్థించారు.