జగిత్యాల, వెలుగు : ధర్మపురి వద్ద గోదావరి పరిస్థితి దారుణంగా మారింది.గోదావరి నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుండడంతో పాటు పట్టణంలోని డ్రైనేజీనీళ్లు కూడా గోదావరిలోనే కలుస్తున్నాయి. దీంతో నీరు కలుషితమై భక్తులు పుణ్యస్నాలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. మరో నాలుగు రోజుల్లో ధర్మపురి లక్ష్మీ నర్సింహాస్వామి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. వారంతా పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు వీల్లేకుండా పుష్కరఘాట్లన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఉత్సవాల నాటికైనా స్నానాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భక్తుల కోరుతున్నారు.
ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ తగ్గడంతో ధర్మపురి వద్ద గోదావరిలో చెప్పుకోదగ్గట్టు నీళ్లు లేవు. మహారాష్ట్ర నుంచి కూడా పాయలాగా మాత్రమే ప్రవాహం వస్తోంది. డ్రైనేజీ వాటర్ గోదావరి లో కలవడంవల్ల తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. పుష్కరాల సందర్భంగా గోదావరి తీరంలో సంతోషీమాత, మంగలిగడ్డ, సోమవిహార్ పేర్లతో ఘాట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ గతం లో ఏర్పాటు చేసిన షవర్లు కూడా పని చేయడంలేదు.
హామీగానే మిగిలిన ట్రీట్ మెంట్ ప్లాంట్
ధర్మపురి పట్టణం లోని డ్రైనేజీ వాటర్ ను గోదావరి లోకి వదలడం వల్ల నీరు కలుషితమవుతోంది. భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం తో దాదాపు రూ. 2 కోట్ల ఖర్చు తో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ప్రభుత్వం భావించింది. మురికి నీటిని శుద్ధి చేసిన తర్వాత గోదావరిలోకి వదులుతామని హామీ ఇచ్చింది. ప్లాంట్ ఏర్పాటుకు ఆఫీసర్లు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత దాన్ని పట్టించుకోకపోవడంతో ప్లాంట్ ఏర్పాటు కలగానే మిగిలింది. ఈ ప్లాంట్ ఏర్పాటు కాకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు
ధర్మపురి లక్ష్మీ నర్సింహా స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 1 వరకు జరగనున్నాయి. ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం సంబంధిత ఆఫీసర్ల తో రివ్యూ చేసింది. మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, తెలంగాణ నుంచి లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
ప్లాంట్ ఏర్పాటు చేయలె
పవిత్ర గోదావరి లో డ్రైనేజీ వాటర్ కలవడం తో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయడం లో బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ అయ్యింది. దీంతో భక్తుల స్నానాలకు మురికి నీరే దిక్కయ్యింది. ఆఫీసర్లు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి
- మంచె రాజేశ్, బీజేపీ స్వచ్ఛభారత్ స్టేట్ కన్వీనర్
షవర్లు ఏర్పాటు చేయాలి
గోదావరి ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన షవర్లు పని చేయలేదు. కనీసం షవర్లు, బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలి. పవిత్ర గోదావరి తీర ప్రాంతం లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి చెత్త చెదారం తొలగించాలి.
- రంగు లక్ష్మీ నరహరి, సామాజిక కార్యకర్త, ధర్మపురి