జగిత్యాల, వెలుగు : ధర్మపురి నియోజకవర్గ ఎన్నికల ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూంను ఆదివారం ఓపెన్ చేయనున్నారు. స్ట్రాంగ్ రూం కీ పోవడంపై ఎంక్వైరీ చేసిన హైకోర్టు, జగిత్యాల జిల్లా ఆఫీసర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ యాస్మిన్ బాషా ఆధ్వర్యంలో అన్ని పార్టీల అభ్యర్థుల సమక్షంలో ఉదయం 11 గంటలకు మల్యాల మండలం నూకపల్లిలోని వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజ్ లోని స్ట్రాంగ్ రూంలకు వేసిన లాక్ ను పగలగొట్టి లేదా టెక్నిషియన్ ద్వారా ఓపెన్ చేయనున్నారు.
స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసిన తర్వాత గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో ధర్మపురి నియోజకవర్గ పోలింగ్ స్టేషన్లలోని 258 ఈవీఎంలలోని సమాచారంతో పాటు 17ఏ, 17సీ డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసి సీల్డ్ కవర్లో హైకోర్టుకు అందించనున్నారు. అలాగే, దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీని కూడా కోర్టుకు సమర్పిస్తారు. గత ఎలక్షన్లలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.