ధర్మారం, వెలుగు: సింగరేణి కార్మికుడినని రాజకీయాల్లోకి వచ్చిన కొప్పుల ఈశ్వర్.. ఇప్పుడు కోట్ల ఈశ్వరుడయ్యారని ధర్మారం కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలోని పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ లీడర్ దేవి జనార్ధన్ మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో వాహనంలో డీజిల్ పోయించుకోవడానికి డబ్బులు లేని కొప్పుల ఈశ్వర్‌కు ఇప్పుడు రూ.వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
మొన్నటి ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఎలా పంచాడో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ఎస్టీ సెల్ నాయకుడు రూప్లానాయక్ మాట్లాడుతూ వివేక్ కుటుంబం ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తూ పేదల కోసం ట్రస్ట్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ యువకుడు, విద్యావంతుడు వంశీకృష్ణ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంటే ఓర్వలేక ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో లీడర్లు కాంపెళ్లి రాజేశం, ఓడ్నాల శంకరయ్య, సోగాల తిరుపతి, వేణుమాధవ్, తిరుపతి, శ్రీనివాస్, చిరంజీవి, దేవి లావణ్య, జనార్ధన్, ఎల్లయ్య, అషు, రఫీ తదితరులుపాల్గొన్నారు.