సూర్యాపేట, వెలుగు : నియోజకవర్గంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అనుచరుల భూ కుంభకోణం, భూదందాలపై న్యాయ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం తెలంగాణ జన సమితి జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల భూ దందాలు పెరిగిపోతున్నాయని తాము మొదటి నుంచి ఆందోళన చేస్తున్నా అధికారులెవరూ పట్టించుకోలేదన్నారు.
బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములను అక్రమంగా పట్టాలు చేయించుకున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని జగదీశ్‌రెడ్డి తన అనుచరులకు కట్టబెట్టారని మండిపడ్డారు. కలెక్టరేట్ భవనానికి ఆనుకొని ఉన్న కుడకుడ126 సర్వే నంబర్ భూమిని నాటి అధికార పార్టీ నాయకుడు కబ్జా చేసి ప్లాట్లు చేసి అమాయకులకు అమ్ముకున్నాడని తెలిపారు.
ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి అక్రమదారులకు సహకరించిన రెవెన్యూ అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్, జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, లీగల్ సెల్ జిల్లా కో–కన్వీనర్ వీరేశ్ నాయక్, పట్టణ కార్యదర్శి పాండు గౌడ్, ఎస్టీ సెల్ పట్టణ కన్వీనర్ దేవత్ సతీశ్, మైనార్టీ సెల్ పట్టణ కన్వీనర్ ఫరీద్, నాయకులు పాల్గొన్నారు.