ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రగతి భవన్ వద్ద ధర్నా చేపట్టారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకు మార్కులకు కలపాలని, లాంగ్ జంప్ ను పాత పద్ధతిలోనే నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నెల రోజులుగా న్యాయం కోసం నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయం ముందట ధర్నాలు నిర్వహించినా, అధికారులకు వినతి పత్రం అందించినా పట్టించుకోవడం లేదని అన్నారు. కోర్టు తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.