
ఆసిఫాబాద్, వెలుగు: ఆర్టీసీ రిక్రూట్మెంట్ లో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ ఆదిలాబాద్ ఆర్ఎంపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ.. ఇటీవల ఆర్టీసీ యాజమాన్యం అవుట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్లను రిక్రూట్ చేసుకుంటామని నోటిఫికేషన్ ఇచ్చిందని, ఆసిఫాబాద్ నుంచి దాదాపు 250 మంది అప్లై చేసుకున్నారని వారిలో ప్రైవేట్ హైర్ డ్రైవర్లు కూడా ఉన్నారని తెలిపారు.
కానీ ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆదిలాబాద్ ఆర్ఎం, పీవో పైరవీలతో కొంతమందిని నిబంధనలకు విరుద్ధంగా రిక్రూట్ చేశారని ఆరోపించారు. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టి ఆర్ఎం, పీవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీసీ డీఎం రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. పీహెచ్బీ డ్రైవర్స్ యూనియన్ ఆసిఫాబాద్ డిపో ప్రెసిడెంట్ మధుసూదన్, ప్రధాన కార్యదర్శి షెఫీఖ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలేశ్ కుమార్, ఉపాధ్యక్షుడు భాస్కర్, పలువురు డ్రైవర్లు పాల్గొన్నారు.