ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్​ కార్మికులు చేపడుతున్న సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్​పాషా తెలిపారు. బుధవారం కాంట్రాక్ట్​ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి హెడ్​ ఆఫీస్​ ఎదుట ధర్నా నిర్వహించారు. మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా షాబీర్​పాషా, జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, ఎర్రగాని కిష్టయ్య, సతీష్​, నిర్మల మాట్లాడారు. సమ్మె విచ్ఛిన్నానికి పాల్పడే వారి కుట్రలను తిప్పి కొడతామని చెప్పారు. సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులను పర్మినెంట్​ చేస్తామని సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైపవర్​ వేతనాలు చెల్లించడంలో యాజమాన్యం అలసత్వం ప్రదర్శిస్తుందన్నారు. ఆరు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా యాజమాన్యం, కాంట్రాక్టర్లు తమకేమి సంబంధం లేదనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జేఏసీ నాయకులు కె సురేందర్, ఇనుమూరి నాగేశ్వరరావు, రమేశ్, ఆంజనేయులు, రాంచందర్, మల్లికార్జున్​ 
పాల్గొన్నారు. 

ఘనంగా హిందీ దివస్

పాల్వంచ,వెలుగు: పట్టణంలోని కేటీపీఎస్  డీఏవీ స్కూల్​లో బుధవారం హిందీ దివస్​ను ఘనంగా జరుపుకున్నారు. పోస్టర్ మేకింగ్, వర్డ్ పజిల్, చార్ట్ మేకింగ్  విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు ప్రైజులను అందజేశారు. ప్రిన్సిపాల్  ఎ రామారావు, హిందీ టీచర్లు ఎంఎస్వీ కృష్ణారావు, నూర్జహాన్, దుర్గాభవాని, నందిని, వజీదా పాల్గొన్నారు.  

గ్రూప్​ ఎగ్జామ్స్​కు ఫ్రీ కోచింగ్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులకు బీసీ స్టడీ సెంటర్​లో ఫ్రీ కోచింగ్​ ఇవ్వనున్నట్లు బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్​ సురేందర్​ తెలిపారు. గ్రూప్–3,4 ఉద్యోగాలకు ప్రిపేర్​ అయ్యే బీసీ నిరుద్యోగులు ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు బీసీ స్టడీ సర్కిల్​లో  సంప్రదించాలన్నారు.  

సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: టీచర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటాలు చేస్తామని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్​ అధ్యక్షుడు కె. శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు చెప్పారు. పెండింగ్​లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ కొత్తగూడెంలోని డీఈవో ఆఫీస్​ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెలవుల మంజూరులో ఆంక్షలు విధించడం అన్యాయమని అన్నారు. కేజీబీవీ స్కూల్స్ కు సంబంధించిన పెండింగ్​ బిల్లులు, నిర్వహణ గ్రాంట్స్, గెస్ట్​ టీచర్ల పెండింగ్​ జీతాలు రిలీజ్​ చేయాలని డిమాండ్​ చేశారు. అనంతరం డీఈవోకు వినతిపత్రం అందించారు. యూనియన్​ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రవి, నాయకులు బి. వెంకటేశ్వరరావు, జహంగీర్, చందు, భాస్కర్, దుర్గారాణి, దేవ్​సింగ్​ పాల్గొన్నారు. 

ఆశ్రమ పాఠశాల విద్యార్థిని అదృశ్యం

బూర్గంపహాడ్, వెలుగు: మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న మేఘన బుధవారం అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములకలపల్లి మండలం చలమన్న గ్రామానికి చెందిన మేఘన ఉదయం 8 గంటల సమయంలో  పాఠశాల నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో వార్డెన్  పేరెంట్స్,​ పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం వరకు బాలిక కోసం వెతికినా ఆచూకీ దొరక లేదు.  హాస్టల్ వార్డెన్  నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె అదృశ్యమైందని పేరెంట్స్​ ఆరోపిస్తున్నారు. ఎస్సై సంతోష్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే మేఘన ఆచూకీ  కోసం ప్రత్యేకబృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు 9440795313, 9440795313, 9490800100 నంబర్లకు ఫోన్​ చేసి చెప్పాలని కోరారు.

గోదావరి తగ్గుముఖం

భద్రాచలం,వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. మంగళవారం రాత్రి 8 గంటల వరకు గరిష్టంగా 51.8 అడుగులకు చేరిన వరద, బుధవారం ఉదయం 6 గంటల వరకు 10 గంటల పాటు నిలకడగా ఉంది. సాయంత్రం 5 గంటలకు 49.80 అడుగులకు నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. 26 గంటల్లో సుమారు 2 అడుగులు మాత్రమే తగ్గింది. భద్రాచలం-వెంకటాపురం మధ్య తూరుబాక, కుదునూరు, ఆలుబాకల వద్ద వరద తగ్గడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. భద్రాచలం నుంచి ఛత్తీస్​గఢ్, ఒడిశా, ఏపీలకు వెళ్లే మార్గంలో రోడ్లు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వాగుల సమీపంలో సాగు చేసిన పత్తి, మిరప తోటలు నీట మునిగాయి. భద్రాచలం వద్ద గోదావరికి రెండో ప్రమాదహెచ్చరిక కొనసాగుతూనే ఉంది.

తెలంగాణ వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

ఖమ్మం, వెలుగు: మూడు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ నెల 16,17,18 తేదీల్లో గ్రామాలు, పట్టణాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరేయాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించడం జరుగుతుందని తెలిపారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

ఎంపీ నామా నాగేశ్వరరావు సిఫార్సుతో ఆరుగురు లబ్ధిదారులకు మంజూరైన రూ.3.28 లక్షల సీఎంఆర్ఎఫ్  చెక్కులను ఎంపీ క్యాంప్  ఆఫీసులో టీఆర్ఎస్​ నేత కనకమేడల సత్యనారాయణ, బాణాల వెంకటేశ్వరరావు అందజేశారు. అనంతరం టేకులపల్లిలో ఇటీవల మృతి చెందిన టీఆర్ఎస్  కార్యకర్త వాకదాని శాంతమ్మ కుటుంబసభ్యులను పరామర్శించారు. పార్టీ లీడర్లు బాణాల వెంకటేశ్వరరావు, చిత్తారు సింహాద్రి యాదవ్, తన్నీరు రవికుమార్, చీకటి రాంబాబు పాల్గొన్నారు.

బతుకమ్మ సంబరాల బ్రోచర్  రిలీజ్

ఖమ్మం టౌన్, వెలుగు: టీఎన్జీవోస్  జిల్లా అధ్యక్షుడు షేక్  అఫ్జల్ హసన్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శాబాస్ జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాల బ్రోచర్ ను బుధవారం కలెక్టర్  వీపీ గౌతమ్  రిలీజ్​ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్  సాగర్, నాయకులు ఈ స్వప్న, నందగిరి శ్రీను, పవన్ కుమార్, సామినేని రఘు కుమార్, బుద్దా రామకృష్ణ, ఆర్ఎన్  ప్రసాద్, వై. శ్రీనివాసరావు, రుక్మారావు, పురుషోత్తంరెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.

సొసైటీలకు చేపల చెరువులు అప్పగించం

గుండాల , వెలుగు: సొసైటీలకు చేపల చెరువులు అప్పగించబోమని గిరిజన రైతులు తేల్చి చెప్పారు. బుధవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో సర్పంచ్ కొమరం సీతారాములు అధ్యక్షతన గ్రామసభ జరిగింది. కిష్టాయి చెరువు, గుండాల ఊర చెరువులకు సంబంధించిన 62 మంది గిరిజన రైతులు పాల్గొన్నారు. చేపల చెరువులను సొసైటీలకు అప్పగించాలని ప్రభుత్వం సర్పంచులకు నోటీసు పంపించినట్లు రైతులకు తెలిపారు. సొసైటీ ఏర్పడాలా? వద్దా అనే దానిపై చేతులెత్తి ఓటింగ్ చేపట్టారు. సొసైటీ వద్దని, పాత పద్ధతినే కొనసాగాలని 62 మంది చేతులెత్తడంతో ఈసారికి వాయిదా వేశారు. కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

డీఎంఎల్టీ స్టూడెంట్​ మిస్సింగ్

సుజాతనగర్, వెలుగు: మండలంలోని సర్వారం గ్రామ పంచాయతీ ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన దీపిక(17) కొత్తగూడెం పట్టణంలోని ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో డీఎంఎల్టీ చదువుతోంది. బుధవారం కాలేజీకి వెళ్లిన దీపిక కనిపించకపోవడంతో దీపిక పేరెంట్స్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై తిరుపతిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేత్రదానంపై అవగాహన

వైరా, వెలుగు: పట్టణంలోని ఠాగూర్ విద్యాసంస్థలో ఖమ్మం నేత్రనిధి క్రాంతి జూనియర్  కాలేజ్​ ఎన్ఎస్ఎస్​ యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం నేత్రదాన అవగాహన సదస్సు నిర్వహించారు. అంధ్వత్వ నివారణ సంస్థ సభ్యుడు సీహెచ్​  హనుమంతరావు మాట్లాడుతూ నేత్రదానం ఎవరైనా చేయవచ్చని చెప్పారు. నేత్రదానం చేయడంతో ఇద్దరు అంధులకు కంటిచూపు ప్రసాదించవచ్చని అన్నారు. ఠాగూర్​ విద్యా సంస్థల కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్, రిటైర్డ్ ఎంపీడీవో ఎం  నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్  కృష్ణారావు, ఎన్ఎస్ఎస్​ పీవో లింగారావు పాల్గొన్నారు. 

గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి

చండ్రుగొండ,వెలుగు: గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేలా దృష్టి సారించాలని జడ్పీ డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం ఎంపీడీవో ఆఫీసులో వివిధ శాఖల ఆఫీసర్లతో సమీక్షించారు. అనంతరం చండ్రుగొండలోని డబుల్ బెడ్రూం ఇండ్లలో ఇటీవల  ఏర్పాటు చేసిన వాటర్  పైప్ లైన్, వాల్స్ లను ఆమె పరిశీలించారు. ఎంపీడీవో అన్నపూర్ణ, ఎంపీవో తులసీరాం పాల్గొన్నారు.

విద్రోహ దినంగా జరపాలి

ఖమ్మం టౌన్, వెలుగు: సెంప్టెంబర్ 17 ను తెలంగాణ విద్రోహ దినంగా జరపాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. ఈ నెల 16,17,18 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి, తెలంగాణకు సంబంధం లేని బీజేపీ విమోచన దినోత్సవంగా ఏడాది కాలం జరిపిస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. గోకినేపల్లి వెంకటేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, సీవై పుల్లయ్య, జి రామయ్య పాల్గొన్నారు.

హార్వెస్ట్  స్కూల్ లో ఎలక్ట్రానిక్​ ఓటింగ్

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం సిటీలోని హార్వెస్ట్ స్కూల్ లో స్టూడెంట్ లీడర్ల ఎన్నిక ఎలక్ట్రానిక్  ఓటింగ్  ద్వారా జరిగింది. ఈ ఎన్నికలో 1800 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఎస్పీసిఎల్ గా 13 మంది, ఏఎస్పీఎల్ గా 8 మంది పోటీ పడ్డారు. ఎస్పీఎల్ గా బి జస్ రాజ్, ఏఎస్పీఎల్ గా జి రిత్విక్ ఎన్నికయ్యారు. గెలుపొందిన వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రోగ్రామ్ కు 11వ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సమిత్ కర్కి హాజరయ్యారు. ఎన్నికైన స్టూడెంట్స్ ను స్కూల్ కరస్పాండెంట్  రవి మారుత్  అభినందించారు.

ఐటీడీఏ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

పాల్వంచ,వెలుగు: పట్టణంలోని కిన్నెరసాని స్పోర్ట్స్ కాలేజీలో బుధవారం ఐటీడీఏ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వివిధ కాలేజీల నుంచి 1100 మంది గిరిజన క్రీడాకారులు ఈ పోటీలకు తరలిరాగా, పోటీలను ఐటీడీఏ పీవో  గౌతమ్  పోట్రు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా కొవిడ్​తో పోటీలు జరుపుకోలేక పోయామన్నారు. క్రీడాకారుల  ప్రతిభను వెలికి తీసేందుకు ఈ క్రీడలు దోహదం చేస్తాయన్నారు. అనంతరం ఐటీడీఏ డీడీ రమాదేవితో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా క్రీడల అధికారి డాక్టర్ వీరునాయక్ భద్రాచలం, ఇల్లందు, ఖమ్మం, దమ్మ పేట, పాల్వంచ ఏటీడీవోలు నరసింహారావు, రూపాదేవి, తిరుమలరావు, చంద్రమోహన్  పాల్గొన్నారు. 

కాలి నడకన వెళ్లి గిరిజనులకు వైద్య సేవలు

అశ్వారావుపేట, వెలుగు: మండలంలోని వినాయకపురం పీహెచ్​సీ సిబ్బంది మండలంలోని మారుమూల గ్రామమైన పెద్ద మిద్దెకు 8 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వైద్య సేవలు అందించారు. 35 మందికి చికిత్స చేసి పరిశుభ్రత పాటించాలని సూచించారు.  విజయ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఏఎన్ఎం చెల్లెమ్మ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

కోళ్లు చోరీ చేస్తూ పట్టుబడి..అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

పెనుబల్లి, వెలుగు: కోళ్లు చోరీ చేస్తూ పట్టుబడ్డాననే అవమానభారంతో మండలంలోని గంగదేవిపాడు గ్రామానికి చెందిన పద్దం నాగేశ్వరరావు(42) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. యారం శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో కోడిపుంజులు మాయమవుతున్నాయి. ఇంట్లో కుక్కలు ఉన్నా కోడిపుంజులు చోరీ అవుతుండటంతో సీక్రెట్ గా సీసీ కెమెరాలను ఇంటి చుట్టూ పెట్టుకున్నాడు. శనివారం రాత్రి నాగేశ్వరరావు కోడిపుంజులు ఎత్తుకుపోతూ సీసీ కెమెరాకు చిక్కాడు. వీడియో పుటేజీతో  వియం బంజర్​ పోలీసులకు కంప్లైంట్​ చేశారు. ఆదివారం పోలీసులు విచారించగా తానే కోడిపుంజలు ఎత్తుకుపోయానని ఒప్పుకొని కోళ్లను యజమానికి అప్పగించాడు. సొంత ఊళ్లో దొంగగా ముద్ర పడడంతో అవమాన భారంతో సోమవారం పురుగుమందు తాగాడు. కుటంబసభ్యులు మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు.

ఎస్సైపై అట్రాసిటీ కేసు పెట్టాలి

నేలకొండపల్లి, వెలుగు: ఎస్సీలను అసభ్య పదజాలంతో దూషించిన ఎస్సై స్రవంతిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి మంద కుమార్  డిమాండ్ చేశారు. బుధవారం ఎమ్మార్పీఎస్, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా, సీపీఎం,బీఎస్పీ, పీడీఎస్ యూ సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. వంగూరి ఆనందరావు, పగిడి కత్తుల ఈదయ్య, పుల్లయ్య, రామదాసు, పగిడికత్తుల నాగేశ్వరరావు, పొట్ట పింజర బాలస్వామి, తోళ్ల ఎంకన్న, నాగభూషణం, రోశయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

ఎస్బీఐటీ కాలేజీలో కొత్త కోర్సులకు పర్మిషన్

ఖమ్మం టౌన్, వెలుగు: ఎస్బీఐటీ ఇంజనీరింగ్  కాలేజీలో బీటెక్  కంప్యూటర్  సైన్స్  అండ్  ఇంజనీరింగ్ కు అనుబంధమైన బీటెక్  సీఎస్ఈ(ఎఎల్అండ్ఎంఎల్) ఆర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్  అండ్  మెషిన్  లెర్నింగ్, బీటెక్ (డేటా సైన్స్) కోర్సులకు ప్రభుత్వం అనుమతిస్తూ జీవో విడుదల చేసినట్లు కాలేజీ చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. మార్పులకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. ఈ నెల 28 నుంచి జరిగే రెండో ఫేస్  ఎంసెట్​ ఆన్​లైన్​ కౌన్సెలింగ్ లో కొత్త కోర్సుల్లో చేరే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

పాఠశాలలో పాము కలకలం 

దమ్మపేట, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలో పాము కలకలం రేపింది. మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్​లో బుధవారం కిటికీలో నుంచి పాము క్లాస్​ రూమ్​లోకి రావడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. గ్రామస్తులు పామును చంపేశారు. 

బైకుల దొంగ అరెస్ట్

భద్రాచలం, వెలుగు: భద్రాచలం పోలీసులు బుధవారం బైకుల దొంగను అరెస్ట్ చేశారు. చర్ల మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన కారం కృష్ణమూర్తి జీతం సరిపోక జల్సాలకు అలవాటు పడి భద్రాచలం టౌన్​లో డూప్లికేట్​ తాళాలతో 15 బైకులను దొంగిలించి కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన కేదాసి రాముడికి తక్కువ ధరకు అమ్మినట్లు ఏఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. 12 బైకులను రికవరీ చేయగా, మరో రెండు బైకులను గుర్తించి రికవరీ చేస్తామని చెప్పారు. సీఐ నాగరాజురెడ్డి, ఎస్సై మధుప్రసాద్​ పాల్గొన్నారు. 

ల్యాబ్​ను ప్రారంభించిన కలెక్టర్​

ఖమ్మం రూరల్, వెలుగు: మండలంలోని వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద దళితబంధు లబ్ధిదారుడు జి నరేశ్​ ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ ల్యాబ్ ను కలెక్టర్ వీపీ గౌతమ్  ప్రారంభించారు. ల్యాబ్ 
నిర్వహణ, ఎలాంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయనే విషయం అడిగి తెలుసుకున్నారు. సెల్ కౌంటర్, సెమి అనలైజర్, సెన్సార్ ఎలక్ట్రోలైటర్  తదితర పరికరాలు ఉన్నాయని నరేశ్​ తెలిపాడు.