ఏటూరు నాగారంలో ఐటీడీఏ ముందు ఆదివాసీల ధర్నా

  • మంచిర్యాలలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన
  • మూడు జిల్లాల్లో గ్రామ సభలను బహిష్కరించిన గిరిజనులు

వెలుగు నెట్​వర్క్​:  తాము సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలంటూ ఆదివాసీలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఏటూరునాగారంలో ఐటీడీఏను ముట్టడించగా, మంచిర్యాలలో కలెక్టరేట్​ఎదుట ధర్నా చేశారు. మెదక్ ​జిల్లా కొల్చారం, వరంగల్ ​జిల్లా నల్లబెల్లి మండలం ఎర్ర చెర్వు తండాల్లో గ్రామ సభలను బహిష్కరించారు.  

ఏటూరునాగారంలో..

పోడుభూములకు పట్టాలివ్వడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఏటూరునాగారం ఐటీడీఏ ఆఫీస్​ను ఆదివాసీలు ముట్టడించారు. ఐటీడీఏ పరిధిలోని సామాజిక దవాఖానాలో జరిగిన​అవుట్​సోర్సింగ్​ నియామకాల్లో అర్హులైన గిరిజనులను కాకుండా డీఎంఅండ్​హెచ్​ఓ, ఇతర ఆఫీసర్లు గిరిజనేతరులను నియమించారని, వారిని తొలగించి స్థానిక ఆదివాసీలకు ఆ పోస్టులు కేటాయించాలని  డిమాండ్​చేశారు.

ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్​ఎంలను నియమించాలని, ఏజెన్సీలో 1/70 చట్టాన్ని​ ఉల్లంఘించి నిర్మిస్తున్న బిల్డింగుల నిర్మాణాలను అడ్డుకోవాలని 25 రోజులుగా ఆదివాసీ సంక్షేమ పరిషత్​ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పీఓ తమ వద్దకు వచ్చి డిమాండ్లు వినాలని పట్టుబట్టడంతో పీఓ అంకిత్​ వారి వద్దకు వచ్చి వినతిపత్రాన్ని తీసుకున్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పినా వినలేదు. తమకు న్యాయం జరిగే వరకు రిలే దీక్షలు కొనసాగిస్తామన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోయం కామరాజు, రాష్ట్ర కార్యదర్శి పాండు హేమ సుందర్, ములుగు జిల్లా కన్వీనర్ పర్షిక సతీశ్​, మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు దానసరి రాజేశ్వరరావు, ఉపాధ్యక్షుడు తాటి సుధాకర్, ప్రధాన కార్యదర్శి పూనెం జనార్దన్​ పాల్గొన్నారు. 

ధర్నాలు..ర్యాలీలు 

కన్నెపల్లి మండలం రెబ్బెనకు చెందిన దళిత, గిరిజన రైతులకు పోడు భూములకు పట్టాలివ్వాలని బీజేపీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్​చార్జి కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల కలెక్టరేట్​ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. తర్వాత జిల్లా అధికారికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెంలో సోమవారం ర్యాలీ తీసి ధర్నాచౌక్​ వద్ద ధర్నా చేశారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుగులోత్ ధర్మా మాట్లాడుతూ కొత్తగూడెంలోని చిట్టి రామవరం ఫారెస్ట్​ రేంజ్​లోని సర్వే నెంబర్​ 20లో ఉన్న 50 ఎకరాల పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్​ చేశారు.  

గ్రామ సభల బహిష్కరణ

మెదక్​ జిల్లా కొల్చారంలో పోడు భూముల  కోసం నిర్వహించిన గ్రామసభను రైతులు బహిష్కరించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న తమకు పట్టాలివ్వాలంటూ 98 మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 32 మంది మాత్రమే అర్హులని ప్రకటించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా సభను బహిష్కరించారు.  వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలం గోవిందపురం శివారు ఎర్ర చెర్వు తండాలోనూ పోడు సాగుదారులు గ్రామసభ బహిష్కరించారు.

తాము సాగు చేస్తున్న భూములకు  రైతుబంధు వస్తున్నా వాటిని ఫారెస్ట్ భూములుగా గుర్తించారన్నారు. ఆఫీసర్లు రీ సర్వే చేయాలంటూ ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్​ లావుడియా రమేశ్​ గ్రామసభను బహిష్కరించారు. మహబూబాబాద్​జిల్లా కొత్తగూడ మండలంలో సోమవారం ఓటాయి, సాధిరెడ్డిపల్లి, ఎంచగూడెం, ఎదుళ్లపల్లిల్లో గ్రామ సభలు పోలీసు పహారా మధ్య నిర్వహించారు.