బోధన్, వెలుగు: పట్టణంలోని మున్సిపల్‌ఆఫీసు ముందు ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లేశ్ మాట్లాడుతూ బోధన్ మున్సిపాలిటీలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదని, దీంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్నట్లు తెలిపారు. ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గతేడాది తెలంగాణ ప్రభుత్వం పెంచిన పీఆర్సీ ప్రకారం జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏడు నెలల బకాయిలు ఇవ్వాలని కోరారు. కార్మికులకు పనిముట్లు, నూనె, సబ్బులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు పర్వయ్య, రాజు, కె.గంగామణి, సైదవ్వ, అబ్బయ్య, ప్రభాస్, పోశెట్టి, మరియమ్మ, సాయమ్మ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీలో బాలల హక్కులపై అవగాహన
మాక్లూర్, వెలుగు: బాలల హక్కులు, బాల్య వివాహాలపై మాక్లూర్ కేజీబీవీలో బుధవారం అవగాహన సదస్సు జరిగింది. పలువురు వక్తలు బాలల హక్కులు, బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే అనర్థాలు, లైంగిక దాడులు, పిల్లల అక్రమ రవాణా తదితర అంశాలపై స్టూడెంట్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ప్రగతి, ఐసీడీఎస్ హెల్త్ సూపర్వైజర్ వరలక్ష్మి, ఐసీపీఎస్ బాబు, హెల్త్ సూపర్వైజర్లు దేవ పాల, సుధాకర్, రాజ్యలక్ష్మి, ఏఎస్సై రాథోడ్పీరుబాయి, కానిస్టేబుల్ లలిత పాల్గొన్నారు.
టీబీ రోగులకు న్యూట్రిషిన్ కిట్లు
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో బుధవారం జరిగిన ఓ ప్రోగ్రాంలో టీబీ రోగులకు న్యూట్రిషిన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో ఎం.సుదర్శనం మాట్లాడుతూ హెల్త్ సెంటర్‌కు చెందిన స్టాఫ్ న్యూట్రీషియన్ కిట్ ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రమేశ్, డాక్టర్ అయేషా ఫాతిమా, జిల్లా టీబీ కోఆర్డినేటర్ రవిగౌడ్, హెల్త్ సూపర్ వైజర్ చంద్రశేఖర్, గోవర్ధన్, లావణ్య, సోమశేఖర్, మున్షి, సంధ్య, రజని పాల్గొన్నారు.
బెల్లాల్ ఇందిరమ్మ కాలనీలో మహిళ శవం
బోధన్, వెలుగు: పట్టణ శివారులోని ఇందిర మ్మ కాలనీలో ఓ మహిళ శవం దొరికింది. బోధన్ టౌన్ సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరమ్మ కాలనీలో ని ఇంటి నంబర్ 11-71 నుంచి దుర్వాసన రావ డంతో చుట్టు పక్కల ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఇంట్లో పరిశీలించగా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్న మహిళ శవం కనిపించిందని సీఐ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఎర్రోల్ల పోశ వ్వ(42)గా గుర్తించినట్లు తెలిపారు. మృతిపై అనుమానాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీఆర్ఏ సిద్దా సతీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు సీఐ చెప్పారు.
బాబా ఆలయ నిర్మాణాలు కాపాడాలి
నిజామాబాద్, వెలుగు: నిజామబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో ఉన్న తేనె సాయిబాబా ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కట్టడాలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఎంపీ అర్వింద్ కలెక్టర్ నారాయణరెడ్డికి లేఖ రాశారు. ఈ ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కోసం షెడ్డును అమ్మవారి ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. ప్రస్తుతం ఈ నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కానీ ఈ ప్రాంతంలో పురాతన కట్టడాలను కూల్చివేస్తున్న అధికారులు ఆలయ ప్రాంగణంలో ఉన్న నిర్మాణాలు సైతం కూల్చి వేయడానికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. అధికారులు స్పందించి ఎంతో మహిమాన్వితమైన సాయిబాబా ఆలయాన్ని, ఈ ప్రాంగణంలో నిర్మించిన కట్టడాలను కాపాడాలన్నారు.
సివిల్ సప్లై హమాలీల నివదిక సమ్మె
పిట్లం, వెలుగు: డిమాండ్ల సాధన కోసం సివిల్ సప్లై హామాలీలు నిరవదిక సమ్మెను ప్రారంభించారు. బుధవారం పిట్లం సివిల్ సప్లై గోదాముల వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ మండల ప్రెసిడెంట్ బుర్రెం బాలరాజ్ మాట్లాడుతూ హామాలీలకు పనికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు. గతంలోజరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి రెండేళ్లకు హామాలీల రేట్లు పెంచుకుంటామన్నారు. ఆక్టోబర్ 12న సివిల్ సప్లై కమిషనర్ చర్చలకు పిలిచి హామాలీల డిమాండ్లకు సానుకూలం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. మళ్లీ నవంబర్ 20న చర్చలకు రమ్మని చెప్పి ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదన్నారు. హామాలీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. కృష్ణ, భూమయ్య, శివయ్య, పీరయ్య, శ్రీనివాస్, పోచమ్మ పాల్గొన్నారు.
న్యూట్రిషన్ కిట్ల నిల్వకు పరిశీలన
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా హాస్పిటల్‌లో న్యూట్రిషన్ కిట్ల నిల్వ కోసం ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలిం చారు. జిల్లాకు 2 వేల న్యూట్రిషన్ కిట్లు మంజూరైనట్లు తెలిపారు. జిల్లా హాస్పిటల్‌లో వా టిని నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసిన స్టోర్ రూమ్‌ను పరిశీలించి ఆఫీసర్లకు సూచనలు చేశారు. డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్, డీసీహెచ్‌వో విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌వో శోభ, ఆర్ఏంవో శ్రీనివాస్ ఆయన వెంట ఉన్నారు.
భర్తను చంపిన కేసులో భార్యకు ఐదేళ్ల జైలు
నందిపేట, వెలుగు: మండల కేంద్రానికి చెందిన గంధం పద్మ అనే మహిళ తన భర్తను చంపిన కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మండల కేంద్రానికి చెందిన గంధం రమేశ్,
పద్మ భార్యాభర్తలు. రెండేళ్ల కింద వీరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో పద్మ రాత్రి సమయంలో రమేశ్ పడుకుని ఉండగా గొంతుకు ఉరి బిగించి చంపేసింది. దీనికి ఆమె కుమారులు ప్రశాంత్, ప్రవీణ్ కూడా సహకరించినట్లు మృతుడి అక్క ఈర్నాల సాయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అప్పటి ఎస్సై రాఘవేందర్ కేసు నమోదు చేయగా సీఐ విజయ్‌కుమార్ దర్యాప్తు చేశారు. కాగా బుధవారం జిల్లా సెషన్స్ కోర్టులో జరిగిన విచారణలో జడ్జి సునీత కుంచాల నిందితురాలు పద్మకు ఐదేళ్లు జైలు శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ
తీర్పు ఇచ్చారు.
ఇసుక టిప్పర్ల పట్టివేత
నవీపేట్, వెలుగు: మండలంలోని యంచ, ఫాకిరాబాద్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తు న్న రెండు టిప్పర్లు పట్టుకుని ఫైన్ వేసినట్లు తహసీల్దార్ వీర్ సింగ్ తెలిపారు. బోధన్ మండలం లోని హాంగర్గ వాగు నుంచి నిర్మల్ జిల్లా బాసరకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో దాడి చేసి పట్టుకున్నట్లు చెప్పారు. టిప్పర్లకు రూ.20 వేల ఫైన్ వేసినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుక, మొరం తరలిస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.