చందుర్తి, వెలుగు : ‘ఎలక్షన్లప్పుడు ఊరికి రోడ్డు వేయిస్తమంటిరి, ఎమ్మెల్యేగా గెలిచాక మమ్మల్ని మరచిపోతిరా, వానలకు రోడ్లు తెగిపోయే, పానం మంచిగా లేక దవాఖానకు పోదామన్నా దారి లేకపాయే, పాణాలు పోతున్నయ్ ఎమ్మెల్యే సారూ.. రోడ్డు వేయించండి’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కొత్తపేట గ్రామస్తులు నిరసన తెలిపారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో వేములవాడ–కోరుట్ల హైవేపై ధర్నా చేశారు. ఏళ్లు గడుస్తున్నా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామానికి వెళ్లే రోడ్డు రెండుచోట్ల పూర్తిగా కొట్టుకుపోయి ఊర్లోకి వెహికల్స్ వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
రోడ్డును తాత్కాలికంగా ఎన్నిసార్లు రిపేర్ చేసినా వర్షాలకు కొట్టుకుపోతోందన్నారు. విషయాన్ని ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కలెక్టర్ వచ్చేదాకా ఆందోళన విరమించేది లేదన్నారు. గ్రామస్తుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాలో పాల్గొన్నారు. పోలీసులు బలవంతంగా ధర్నాను విరమింపచేసే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులను బలవంతంగా పోలీస్ వెహికల్ లో ఎక్కించారు. స్థానిక టీఆర్ఎస్ లీడర్లు వద్దని చెప్పడంతో పోలీసులు గ్రామస్తులను విడిచిపెట్టారు. ఎంపీడీవో, తహసీల్దార్, పంచాయతీరాజ్ ఏఈలు పై ఆఫీసర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.