కూలీ పైసలియ్యాలంటూ మోడల్ స్కూల్ ముందు మేస్త్రీల ధర్నా

కొమురంభీం జిల్లా:  కాగజ్ నగర్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ముందు మెస్త్రీలు, కూలీలు ధర్నా చేశారు. తమకు ఇవ్వాల్సిన కూలీ డబ్బుల బకాయిలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు.  ఆరు నెలల నుంచి కూలీ డబ్బుల గురించి  సబ్ కాంట్రాక్టర్ ను అడిగితే.. మెయిన్ కాంట్రాక్టర్ తనకు ఇవ్వడం లేదని చెబుతూ వస్తున్నాడని.. ఇవ్వకుండానే చేతులు దులుపుకునే ప్రయత్నం  చేస్తున్నారని ఆరోపించారు. రేపు స్కూల్ ఓపెనింగ్ జరిగాక కాంట్రాక్టర్ డబ్బులివ్వకుండా వెళ్లిపోతే తమ పరిస్థితి ఏమిటి..? తమను ఎవరు పట్టించుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగజ్ నగర్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్.. నిర్మాణం పూర్తి చేసుకుని రేపు ప్రారంభానికి సిద్ధమైంది. కాంట్రాక్టరు తాను దక్కించుకున్న పనిని  సబ్ కాంట్రాక్టర్ కు ఇచ్చాడు. ఆరు నెలల క్రితమే నిర్మాణం పూర్తి చేశారు. చేసిన పనికి డబ్బులు ఇవ్వాలంటూ సుమారు వంద మంది కూలీలు తరచూ సబ్ కాంట్రాక్టర్ ను అడుగుతున్నారు. 

తాను మీలానే మెయిన్ కాంట్రాక్టర్ చుట్టూ తిరుగుతున్నానని.. కూలీ డబ్బులు  20 లక్షలు చెల్లించాల్సి ఉందని సబ్  కాంట్రాక్టర్ వాపోయారు. చేసిన పనుల లెక్క తేల్చమంటే పట్టించుకోకుండా మొహం చాటేశాడని.. రేపు స్కూల్ ఓపెనింగ్ జరిగితే తాను ఎవర్ని అడగాలో తెలియక తాను కూడా మేస్త్రీలు, కూలీలతో కలసి ధర్నా చేస్తున్నానని చెప్పారు. తమకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇప్పించాలంటూ రెసిడెన్షియల్ స్కూల్ ముందు కూలీలు, మేస్త్రీలు ధర్నా చేపట్టడంతో అధికారులు స్పందించి విచారణ చేపట్టారు.