అలంపూర్, వెలుగు : జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలోని 44 నంబర్ హైవేపై పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో గురువారం పాల ట్యాంకర్ ఢీకొని చనిపోయిన హైవే మెయింటెనెన్స్ కూలీల డెడ్‌బాడీలతో వారి కుటుంబ సభ్యులు శుక్రవారం హైవేపై ఆందోళన చేశారు. చనిపోయిన రమేశ్, సీతారాముడు కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ఇస్తామని హైవే మెయింటెనెన్స్ ఆఫీసర్లు హామీ ఇచ్చారు. అయితే పోస్టుమార్టం అనంతరం డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన మృతుల బంధువులు, గ్రామస్థులు పుల్లూరు టోల్ ప్లాజా హైవే మెయింటనెన్స్ ఆఫీస్ ముందు డెడ్‌బాడీలను ఉంచి బైఠాయించారు.
బాధితులు మాట్లాడుతూ హైవే మెయింటెనెన్స్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. హైవే మెయింటెనెన్స్ తరపున ఇన్సూరెన్స్, తక్షణ ఆర్థికసాయం, బెనిఫిట్స్ అందేలా చూడాలని కోరారు. అన్ని బెనిఫిట్స్ వచ్చేలా చూస్తామని అధికారులు హామీ పత్రాన్ని ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, రాస్తారోకోతో హైవేపై రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఉండవల్లి పోలీసులు వెహికల్స్ ను క్లియర్ చేశారు.