- ఇందిరాపార్క్ వద్ద భూ నిర్వాసితుల ధర్నా
ముషీరాబాద్, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితులు ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టారు. ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, వ్యవసాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ పాల్గొని మాట్లాడారు. రోడ్లు, ప్రాజెక్టులకు రైతులు భూమి ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే మార్కెట్రేటు చెల్లించి భూమి తీసుకోవాలని కోరారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ మీదుగా ట్రిపుల్ఆర్పోవడంతో మూడు వార్డులు మున్సిపాలిటీ నుంచి విడిపోతున్నాయని చెప్పారు. వెంటనే అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు కూనుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పగిళ్ల రాజశేఖర్ రెడ్డి, జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు పాల్గొన్నారు.