
హుజూరాబాద్, వెలుగు: మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని హుజూరాబాద్‌లో మున్సిపల్ కార్మికులు బల్దియా ఆఫీసు ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ జీతాలు రాకపోవడంతో పూట గడవటం కష్టంగా మారిందన్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఆందోళన బాటపట్టామన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ అక్కడికి చేరుకొని రెండు రోజుల్లో వేతనాలు అందజేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళనను విరమించారు.