- రైతులు, యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మిర్యాలగూడ, వెలుగు: యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు భూములిచ్చిన తమకు నేటికీ పరిహారం ఇవ్వలేదని, ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని యాదాద్రి పవర్‌ప్లాంట్ ఎదుట నిర్వాసితులు ఆందోళన చేశారు. హామీలు నెరవేర్చాలని అడిగేందుకు వచ్చిన తమను పోలీసులతో భయపెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్పనులను పరిశీలించేందుకు సోమవారం సీఎం కేసీఆర్ వచ్చారు. ఆయన వస్తున్న విషయం తెలుసుకున్న తాళ్లవీరప్పగూడెం, మొగిలకుంట తండాకు చెందిన రైతులు, యువకులు ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. సీఎంతో తమ గోడు చెప్పుకుందామని వెళ్తున్న వారిని ప్లాంట్ గేటు ముందు భారీగా మోహరించిన పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో నిర్వాసితులు అక్కడే ధర్నా చేశారు.
యాదాద్రి పవర్ ప్లాంట్‌కు భూములు ఇస్తే మంచి రేటుతో పాటు ప్లాంటులో జాబులు ఇప్పిస్తామని లోకల్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, మంత్రి జగదీశ్‌రెడ్డి, అప్పటి రెవెన్యూ ఉన్నతాధికారులు తమకు హామీ ఇచ్చారని, తీరా అరకొర పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని నిర్వాసితులు తెలిపారు. ఇప్పటికైనా తమ భూములకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వడంతో పాటు అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కాగా, నిర్వాసితులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
చివరకు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంకొంత మంది రైతులు అక్కడికి చేరుకొని పట్టా సర్టిఫికెట్లు చూపుతూ ఆందోళన చేశారు. గత ప్రభుత్వాలు తమకు పట్టాలిచ్చినా పరిహారం ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నేతలు, అధికారులు నిర్వాసితుల లిస్ట్‌ను మార్చి తమకు అన్యాయం చేశారని చెప్పారు. తమ గోసను సీఎం కేసీఆర్‌కు చెప్పుకుందామని వస్తే పోలీసులను పెట్టి భయబ్రాంతులకు గురిచేసి వెనక్కి పంపిస్తున్నారని వాపోయారు.
కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్
యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం ఏర్పాటు చేసిన రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించడంతో పాటు పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం వీర్లపాలెం జీపీ పరిధిలోని సాత్ తండా వద్ద కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి ఆందోళన చేశారు.
దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, గాజుల శ్రీనివాస్, బాలు నాయక్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి సహా పలువురు కౌన్సిలర్లను మిర్యాలగూడ పట్టణ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.