కరీంనగర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయిని అడ్డుకున్న యువకులు

కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి స్టేజి వద్ద యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. గుండ్లపల్లి నుండి గన్నేరువరం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్ జామ్ అయింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అదే సమయంలో హైదరాబాద్ వెళ్లేందుకు అటుగా వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకున్న ఎమ్మెల్యేను చూసి ఆగ్రహానికి గురైన యువకులు... కారు వెంట పరుగులు తీశారు. అనంతరం పోలీసుల సహాయంతో రసమయి వాహనంలో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ధర్నా చేస్తున్న యువకులను పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మహాధర్నాతో తనను అడ్డుకోవటంపై ఎమ్మెల్యే రసమయి ఆగ్రహం వ్యక్తం చేశారు. రహాదారి కోసం తాను ఇప్పటికే ప్రతిపాదనలు పంపానని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ తీరుపై ఎమ్మెల్యే రసమయి మండిపడ్డారు. కొంతమంది కావాలనే రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు.