- మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తున్న కాంట్రాక్ట్, ఔట్‍సోర్సింగ్‍ఉద్యోగులు
- డిమాండ్లను నెరవేర్చాలని ఆశా వర్కర్లు, ఆర్టిజన్ల ధర్నాలు
వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లా వరుస ఆందోళనలతో వారం రోజులుగా దద్దరిల్లుతోంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, కార్మికులు తమ డిమాండ్లను సాధించుకొనేందుకు ఆందోళనలు తీవ్రం చేశారు. పేదలకు అందాల్సిన డబుల్ బెడ్ రూమ్లు వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ధర్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో మంత్రుల, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల ముందు నిరసనలు తెలుపుతున్నారు. జీతాలు పెంచి తమను రెగ్యులరైజ్ చేయకుంటే లక్ష మందితో హైదరాబాద్‍లో గర్జన సభ నిర్వహించి తమ సత్తా చాటుతామని ఔట్‍సోర్సింగ్ ఉద్యోగులు, కనీస వేతనాలు అమలు చేయాలని ఆశా వర్కర్లు, సమాన పనికి సమాన వేతనం అమలు చేసి ఆర్టిజన్లుగా గుర్తించాలని ఎన్పీడీసీఎల్ కార్మికులు ఉద్యమిస్తున్నారు.
మంత్రి ఎర్రబెల్లి ఇంటిపైకి.. ఆశా వర్కర్లు
ఆశా వర్కర్లకు రూ.18 వేల జీతం చెల్లించాలని.. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక ఆశా వర్కర్‍ను నియమించాలని ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి జయశంకర్, ములుగు, మహబూబాబాద్ జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు దిగారు. ఎక్కడికక్కడ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఆగస్ట్ 29న వందలాది మందితో నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారు. ఏకంగా గ్రేటర్ వరంగల్ హనుమకొండ రాంనగర్‍లోని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు ఇంటి ముట్టడికి దిగారు. పోలీసులు తమ బలగాలతో వారిని కట్టడి చేయాల్సి వచ్చింది. దీంతో వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఔట్‍సోర్సింగ్‍ల.. ఆత్మ గౌరవ సభ
తమను రెగ్యులరైజ్ చేస్తారనే ఆశతో రాష్ట్ర సాధనలో ముందుండి పోరాటం చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం తమకు ఆత్మ గౌరవం లేకుండా చేసిందని ఔట్ సోర్సింగ్ కార్మికులు జిల్లాలవారిగా ఆందోళనలకు దిగారు. ఆగస్ట్ 27న హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఏజెన్సీ వ్యవస్థలను ఎత్తివేసి వెంటనే ఔట్‍సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ ఎంప్లాయిస్‍గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సెప్టెంబర్‍లో హైదరాబాద్‍లో లక్ష మందితో ఔట్‍సోర్సింగ్ ఉద్యోగుల గర్జనకు పిలుపు ఇచ్చారు.
విద్యుత్‍భవన్‍ముట్టడి
కనీస వేతనం అమలు చేయాలంటూ కార్మికులు హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న 1535 మంది కార్మికులు తమను ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రూ. 8 వేల జీతంతో తమను అవమానపరుస్తున్నారని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వశిక్షా అభియాన్‍లో 18 ఏండ్ల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని హనుమకొండ కాళోజీ జంక్షన్‍లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాలకు దిగారు. ఏండ్ల తరబడి తమకు అన్యాయం జరుగుతోందన్నారు.
పార్టీల ఆధ్వర్యంలో
డబుల్ బెడ్‍రూం ఇండ్ల పంపిణీ, గ్రేటర్ వరంగల్ సిటీలో వరద బాధితులకు సాయం అందించాలనే డిమాండ్‍తో ఆగస్ట్ 14న కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రేటర్ కార్పొరేషన్ ముట్టడి సిటీలో టెన్షన్‍కు గురిచేసింది. నాయిని రాజేందర్‍రెడ్డి కొందరు ముఖ్య నేతలు ఎంజీఎం జంక్షన్ వరకు దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డబుల్ బెడ్‍రూం ఇండ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలంటూ ఎమ్మెల్సేల ఇండ్లను బీజేపీ శ్రేణులు ముట్టడించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‍విప్ దాస్యం వినయ్ భాస్కర్ క్యాంప్‍ఆఫీస్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వి నయ్‍భాస్కర్ ఇంటిముందు చిన్నపాటి యుద్దమే జరిగింది.
బీఆర్‍ఎస్, బీజేపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. కార్యకర్తల తలలు పగిలి రక్తాలు కారాయి. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇనుప కంచెలు, బారికేడ్లు పెట్టారు. అయినా ఆందోళన ఆగకపోవడంతో సిటీలో రచ్చరచ్చ అయింది. బీజేపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టి జైల్ తరలించగా.. బెయిల్‍పై వారు బయటకొచ్చారు. మొత్తంగా డబుల్ బెడ్‍రూం ఇండ్ల అంశం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.