నల్గొండ, వెలుగు : ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎల్లమ్మ తల్లి వార్షిక బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన కల్యాణోత్సవానికి ఆయన తన సతీమణి సబితతో కలిసి హాజరయ్యారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
కల్యాణం అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనాలు చేశారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఈవో జల్లపల్లి జయరామయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ నగేశ్, ప్రధాన అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణ్ కుమార్ చారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్, వెంకటలక్ష్మి పాల్గొన్నారు .