వరంగల్, వెలుగు: బీఆర్ఎస్ బలోపేతానికి, తన బాబాయ్ కోసం ఎంత పని చేసినా.. సరైన గుర్తింపు రాకపోగా.. అవమానాల పాలయ్యానని మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ కుమారుడు, 60వ డివిజన్ కార్పొరేటర్ ధాస్యం అభివన్ అన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం ఆయన రెడ్డికాలనీలోని శారద ఫంక్షన్ హాల్‍లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ.. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోసం తమ కుటుంబం ఎన్ని త్యాగాలు చేసినా ఫలితం లేద న్నారు.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో వివిధ పార్టీల నుంచి తనకు ఆఫర్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు పరకాల సీటు ఇస్తామన్నా..కుటుంబంలో కలహాలు రావొద్దని బాబాయ్ కోసం దానిని వదులుకుని ఆయన విజయం కోసం శ్రమించినట్లు పేర్కొన్నారు. ఆ ఓటమికి తాను కారణం అంటూ ప్రచారం చేశారని ఆవేదన చెందారు. ఆత్మ గౌరవం లేనిచోట ఉండలేనన్నారు.సమావేశంలో రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్ సింగ్, మాజీ కార్పొరేటర్ డిన్నా, రావుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. అభినవ్ భాస్కర్ నేడోరేపో బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read : హరితహారం స్కీమ్ లో.. బయట నుంచి మొక్కలు ఎంతకు కొన్నరు?