బేస్మెంట్ ఎంత బలంగా ఉంటే ఇల్లు అంత ఎక్కువ కాలం నిలబడుతుంది. పైన ఎన్ని అంతస్తులు కట్టినా ప్రమాదం ఉండదు. కానీ.. పునాదిని పట్టించుకోకుండా ఫ్లోర్ మీద ఫ్లోర్ లేపితే నిట్టనిలువునా కూలి నేలమట్టం అవుతుంది. ఇళ్లు కొనుక్కోవటానికి, కట్టుకోవటానికి లోన్లు ఇచ్చే డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ ఈ చిన్న లాజిక్ మిస్ కావటంతో కోలుకోలేని దెబ్బతింది.
కలల ఇంట్లోకి కాలు మోపండి.. ఇదీ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్) స్లోగన్. హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్లో ఎంతో ఫాస్ట్‌గా ఎదిగిన డీహెచ్ఎఫ్ఎల్ అంతే వేగంగా పడిపోయింది. నిన్న మొన్నటిదాకా స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేసిన ఈ సంస్థ కొండంత నష్టాల్ని, చెడ్డ పేరును మూటగట్టుకుంది. హోమ్ లోన్లు ఇచ్చే లెండర్లకు ఒకప్పుడు ఇదే మోడల్. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లకు ఇప్పుడో గుణపాఠంలా మిగిలిపోయింది.
అప్పుడు బ్రాండ్.. ఇప్పుడు బ్యాడ్..
హౌసింగ్ ఫైనాన్స్‌లోకి డీహెచ్ఎఫ్ఎల్ 34 ఏళ్ల కిందట అడుగుపెట్టింది. దేశంలో 300లకు పైగా బ్రాంచ్‌లతో వివిధ సిటీలు, టౌన్లలో ఎంతో మంది మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను ఇన్నాళ్లూ సక్సెస్‌ఫుల్‌గా నిజం చేసింది. ఈ రంగంలో నిన్నటి వరకు ఇదే నంబర్–1 బ్రాండ్. హౌజింగ్ లోన్లు ఇచ్చేందుకు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తే అద్భుతమైన స్పందన వచ్చేది. దాదాపు రూ.6000 కోట్లను ప్రజలు ఈ కంపెనీలో డిపాజిట్ చేశారు. ఈ సంస్థకు దాదాపు లక్ష మంది డిపాజిటర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లే. బ్యాంకుల కన్నా ఎన్బీఎఫ్సీలో వడ్డీ రేటు ఎక్కువనే ఆశతో డీహెచ్ఎఫ్ఎల్లో డబ్బు దాచుకున్నారు. ఈ కంపెనీ షేర్లకు స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో భారీ డిమాండ్ ఉండేది. గతేడాది సెప్టెంబర్‌లో ఆల్ టైమ్ పీక్ స్టేజ్ (రూ.678)కి చేరింది. టెంపరరీగా ఏవైనా ఆర్థిక ఇబ్బందులొచ్చినా తట్టుకోగలిగే స్థాయిలో తమ వద్ద క్యాష్ బ్యాలెన్స్ ఉందని గొప్పగా, ధీమాగా చెప్పుకునేది.
కానీ, ఆ మాట మీద ఎంతో కాలం నిలబడలేకపోయింది. డిపాజిట్లు చెల్లించలేక చేతులెత్తేసింది. మరీ అవసరమైతే తప్ప ప్రీ–మెచ్యూర్ విత్‌డ్రా కుదరదంటూ మొండికేసింది. పేమెంట్లలో డిఫాల్ట్ కావటంతో డీహెచ్ఎఫ్ఎల్ రేటింగ్ ‘ఏ’ లెవెల్ నుంచి ‘బీబీబీ’కి పడిపోయింది. రూల్స్ ప్రకారం ఇంత తక్కువ రేటింగ్ ఉన్న ఎన్బీఎఫ్సీ జనం నుంచి డిపాజిట్లు తీసుకోవటానికి వీల్లేదు. అందుకే డీహెచ్ఎఫ్ఎల్ తప్పనిసరి పరిస్థితుల్లో ‘ఇకపై పబ్లిక్ డిపాజిట్లు తీసుకోబోమని, రెన్యువల్స్ నిలిపేస్తున్నామ’ని మే నెలలో చెప్పాల్సి వచ్చింది.
అందరిలోనూ ఆందోళన
డీహెచ్ఎఫ్ఎల్ దగ్గర లిక్విడ్ క్యాష్ డిపాజిట్లు కరిగిపోతుండటం క్రమంగా మొదలైంది. కొత్త డిపాజిట్లు వచ్చే మార్గాలు మూసుకుపోయాయి. దీంతో ఆ కంపెనీకి లోన్లు ఇచ్చిన సంస్థలు, ఇన్వెస్టర్లు, కస్టమర్లలో ఆందోళన మొదలైంది. సంస్థ షేర్ విలువ ఏకంగా 97 శాతం కోల్పోయి ప్రస్తుతం రూ.21.15 వద్ద ఆగిపోయింది. క్రిసిల్ సంస్థ ఈ కంపెనీ కమర్షియల్ పేపర్ విలువ(రూ.850 కోట్ల)ను బాగా (ఏ3+ నుంచి ఏ4+కి) తగ్గించింది. మేనేజ్మెంట్కి, లెండర్లకు మధ్య పరిష్కారం కోసం చర్చలు జరిగినా ఫలించలేదు. బ్యాడ్ ఇమేజ్ చుట్టుముట్టిన తొలి ఎన్‌బీఎఫ్‌సీగా చరిత్రలో నిలిచిపోనుంది.
డీహెచ్ఎఫ్ఎల్ నెత్తిన 88 వేల కోట్ల అప్పు!
డీహెచ్ఎఫ్ఎల్ రూ.6 వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు సేకరించినట్లు చెబుతున్నారు. వీటికితోడు బ్యాంకుల నుంచి రూ.38 వేల కోట్లు లోన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. మ్యూచ్‌వల్ ఫండ్లు, బాండ్ హోల్డర్లు, ఇతరత్రా అప్పులు మొత్తం రూ.88 వేల కోట్ల రుణ భారం మోస్తోందని అంటున్నారు.
ఎక్కడ తప్పు జరిగింది?
డీహెచ్ఎఫ్ఎల్ తన కస్టమర్లకు 15–20 ఏళ్ల కాలానికి లాంగ్ టర్మ్ లోన్లు ఇస్తుంది. తానేమో బ్యాంకులు, ఇన్వెస్టర్లు, లెండర్ల నుంచి షార్ట్ టర్మ్ లోన్లు తీసుకుంటుంది. ఎన్బీఎఫ్సీలు చాలా వరకు ఇదే చేస్తాయి. కానీ ఈ సంస్థ లోన్ గ్రోత్ విపరీతమైన వేగంతో దూసుకెళ్లింది. కొన్ని క్వార్టర్లలో 25–30 పర్సంటేజీ నమోదయ్యేది. దీనివల్ల తనకు నెల నెలా కిస్తీల రూపంలో రావాల్సిన డబ్బులు తగ్గి, తాను చేయాల్సిన పేమెంట్లు మాత్రం పెద్దఎత్తున పెరిగిపోయాయి. దీంతో సంస్థ ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది.