ధోనికి అనుకూలంగా మద్రాస్ హైకోర్టు తీర్పు.. ఐపీఎస్ అధికారికి జైలు శిక్ష

ధోనికి అనుకూలంగా మద్రాస్ హైకోర్టు తీర్పు.. ఐపీఎస్ అధికారికి జైలు శిక్ష

భారత మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఓ ఐపీఎస్​ అధికారికి 15 రోజుల  జైలు శిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును సవాల్​ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు వాయిదా వేసింది.

ఏంటి  ఈ కేసు..?

2013లో ఐపీఎస్​ అధికారి సంపత్​ కుమార్​ జీ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ​లో మాట్లాడుతూ ఐపీఎల్‌లో ఫిక్సింగ్ జరుగుతోందని ఆరోపించారు. అంతేకాకుండా ఆ​ ఫిక్సింగ్​కు, క్రికెటర్​ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధం ఉన్నట్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధోనీ, తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకుగానూ సంబంధిత టీవీ ఛానల్​తో పాటు అధికారి సంపత్​పై 2014లో పరువు నష్టం దావా వేశారు. తనకు పరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేయడంతో పాటు తనపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు జారీ చేయకుండా లేదా ప్రచురించకుండా నిరోధించాలని కోరాడు.

ధోని పిటిషన్​ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మధ్యంతర నిషేధాన్ని మంజూరు చేసింది. ధోనీపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయకుండా జీ, సంపత్ కుమార్ మరియు ఇతరులపై నిషేధం విధించింది. అలాగే, పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ జీ టీవీ యాజమాన్యానికి, సంపత్​ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఐపీఎస్​ అధికారి సంపత్​ కుమార్ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ధోనీ మరోసారి కోర్టు మెట్లెక్కారు. ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ తన పరువుకు మరింత నష్టం కలిగించే ప్రకటనలు చేశాడని పేర్కొంటూ మరో పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు ధిక్కరణ కింద వెంటనే సంపత్​పై చర్యలు తీసుకోవాలని మద్రాస్​ హైకోర్టును ధోనీ కోరారు.

శుక్రవారం ఈ పిటిషన్​ విచారణకు రాగా ఎస్ఎస్ సుందర్ మరియు సుందర్ మోహన్ ల బెంచ్  ఐపీఎస్ అధికారి సంపత్‌కు 15 రోజుల సాధారణ  జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాల్​చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును హైకోర్టు నెల రోజులు పాటు వాయిదా వేసింది.