
చెన్నై: తాను ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని వస్తున్న ఊహాగానాలపై చెన్నై సూపర్‌కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పష్టత ఇచ్చాడు. ఇప్పటికిప్పుడు మెగా లీగ్‌కు గుడ్‌బై చెప్పే అవకాశమే లేదని స్పష్టం చేశాడు. ‘నేను ఇంకా ఐపీఎల్‌లో ఆడుతున్నా. కాబట్టి ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించే చాన్సే లేదు. ఈ విషయంపై ఏడాదికి ఒకసారి సమీక్షించుకుంటా. ప్రస్తుతం నాకు 43 ఏండ్లు. జూలైలో 44వ ఏడాదిలోకి అడుగుపెడతా. కాబట్టి లీగ్‌లో కొనసాగాలా..? వదా..? అన్నది నిర్ణయించుకోవడానికి నాకు ఇంకా 10 నెలల సమయం ఉంది.
నా రిటైర్మెంట్‌ను నిర్ణయించేది నేను కాదు. నా శరీరం చెప్పాలి. సీజన్‌కు ముందు శరీరం సహకరిస్తుందనిపిస్తే ఆడతా. లేదంటే ఆపేస్తా. ఇక చాలు అనే వరకు ఇదే విధానాన్ని కొనసాగిస్తా’ అని మహీ ఓ పాడ్‌కాస్ట్‌లోపేర్కొన్నాడు. శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ను తిలకించేందుకు తొలిసారి ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకి స్టేడియానికి రావడంతో అతని వీడ్కోలుపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే మ్యాచ్ తర్వాత మహీ ఎలాంటి వీడ్కోలు ప్రకటన చేయకపోవడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.