- ధోనీకి ఇదే చివరి సీజనా?
చెన్నై: సీఎస్కే కెప్టెన్సీ మార్పులో లెజెండరీ మహేంద్ర సింగ్ ధోనీ తన మార్కు చూపెట్టాడు. గత సీజన్‌లో చెన్నైకి టైటిల్ అందించిన మహీ.. సీఎస్కే కెప్టెన్సీని రతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. ఈ విషయాన్ని చివరి నిమిషం వరకూ దాటి పెట్టాడు. ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల ఫొటో సెషన్‌కు రుతరాజ్ గైక్వాడ్ వచ్చేదాకా సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ సహా ఎవ్వరికీ కెప్టెన్సీ మార్పు గురించి తెలియలేదు.
ఇదే టైమ్‌లో ‘ధోనీ సీఎస్కే కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు’ అని సీఎస్కే ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ధోనీ ఏం చేసినా అది జట్టుకు మేలు చేస్తుంది. కెప్టెన్ల సమావేశానికి ముందు నేను తన నిర్ణయం గురించి తెలుసుకున్నా. ఇది మహీ నిర్ణయం. దాన్ని మనం గౌరవించాలి’ అని కాశీ చెప్పారు. 2019 నుంచి సీఎస్కే టీమ్‌తో ఉన్న రుతురాజ్ ఐపీఎల్‌లో మొత్తం 52 మ్యాచ్‌లు ఆడాడు. 27 ఏండ్ల రుతురాజ్‌కు కెప్టెన్సీ కొత్తేం కాదు.
గతేడాది ఆసియా గేమ్స్‌లో కెప్టెన్‌గా ఇండియాకు గోల్డ్ అందించాడు. మరోవైపు సీఎస్కే కెప్టెన్సీ మార్పు మహీ ఫ్యూచర్‌పై ఊహాగానాలకు దారితీసింది. ఏజ్ దృష్ట్యా 42 ఏండ్ల మహీకి ఇదే చివరి సీజన్ అనొచ్చు. దాంతో తాను ఉన్నప్పుడే కొత్త లీడర్‌ను తయారు చేయాలని రుతురాజ్‌కు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. మహీ 2020లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు.
గతేడాది సీఎస్కేకు ఐదో టైటిల్‌ను అందించిన తర్వాత అతను ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెబుతాడని అనుకున్నారు. కానీ, తాను రిటైర్ అవ్వడం లేదని ధోనీ చెప్పాడు. 2023లో మోకాలి గాయంతోనే ఆడిన మహీ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. సీజన్ తర్వాత మోకాలికి సర్జరీ చేయించుకున్న మహీ ఈసారి మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. టీమ్ ప్రాక్టీస్ క్యాంప్‌లో ఆలస్యంగా చేరినా.. నెట్స్‌లో తన మార్కు సిక్సర్లు కొడుతూ.. జులపాల జుట్టుతో పాత ధోనీని తలపిస్తున్నాడు.
ధోనీ కెప్టెన్సీ రికార్డు
మ్యాచ్‌లు 212
విజయాలు 128
ఓటములు 82
నో రిజల్ట్ 2
ట్రోఫీలు 5