చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘ధూం ధాం’. గోపీ మోహన్ కథ, స్ర్కీన్‌ప్లే అందించిన ఈ సినిమా నవంబర్ 8న విడుదలవుతోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు శ్రీనువైట్ల, వైవీఎస్ చౌదరి, సాయి రాజేష్ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ‘రెడీ’ తరహాలో ‘ధూం ధాం’ హిట్ అవ్వాలని శ్రీనువైట్ల కోరారు.
చేతన్ కృష్ణ మాట్లాడుతూ ‘ఇదొక హిలేరియస్ ఎంటర్టైనర్. నవ్వులు గ్యారెంటీ. అయితే మన తెలుగు చిత్రాలకు కాకుండా చిన్న డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఇస్తున్నారు. ఇది మాకు బాధ కలిగిస్తోంది. తెలుగు నేటివ్ మూవీస్‌ను ఎంకరేజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా’ అని చెప్పాడు. ఈ సినిమా తనకు బెస్ట్ వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిందని హెబ్బా పటేల్ చెప్పింది. ప్రేక్షకుల టికెట్ రేటుకు సరిపడా నవ్వులు అందిస్తామని దర్శకుడు సాయి కిషోర్ అన్నాడు. ‘మా అబ్బాయి చేతన్‌ను హీరోగా మరో మెట్టు ఎక్కించే చిత్రమవుతుందని నమ్మకం ఉంది’ అని నిర్మాత రామ్ కుమార్ అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.