ఆదివాసీలకు టెస్ట్​లు దూరం

  •     మంజూరైన టీ డయాగ్నోస్టిక్​ సెంటర్ వెనక్కి
  •     క్లారిటీ లేని సర్కారు జీవో నిధులు దారి మళ్లింపు
  •     ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
  •     ఐటీడీఏది కూడా వైఫల్యమే

భద్రాచలం, వెలుగు: ఐటీడీఏ పరిధిలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేయాల్సిన టీ డయాగ్నోస్టిక్​ సెంటర్ ​వెనక్కి వెళ్లిపోయింది. సెంటర్ ​కోసం భవనం నిర్మించేందుకు రూ.94 లక్షలు మంజూరు చేస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. కాని జీవోలోని లోపాల కారణంగా నిధులు ఖర్చు చేయలేక పోయారు. దీంతో ఆ నిధులు దారి మళ్లాయి. సర్కారు నిర్లక్ష్యం ఫలితంగా ఆదివాసీలకు ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలను దూరం చేసింది. వచ్చిన నిధులను వాడుకోవడంలో ఐటీడీఏ వైఫల్యం చెందడం కూడా ఒక కారణమే. ఇప్పుడు ఆదివాసీలకు ఉచిత రక్త పరీక్షలు కావాలంటే కొత్తగూడెం నుంచి వచ్చే టీంలు శాంపిల్స్ తీసుకుని వెళ్లి టెస్ట్ లు చేసి రిపోర్టులు పంపుతున్నారు. ఇది పెద్ద సమస్యగా మారింది. కొందరికి రిపోర్టులు అందుతున్నాయి. మరికొందరికి అందడం లేదు. 

ఉత్తర్వుల్లో క్లారిటీ లేక...

2021లో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో టీ డయాగ్నోస్టిక్​సెంటర్ ఏర్పాటు చేసేందుకు గిరిజన సంక్షేమశాఖకు రూ.94లక్షలు మంజూరు చేశారు. బిల్డింగ్ కోసమా..? పరికరాలు కొనుగోలు చేసేందుకా..? అనేది జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. దీంతో దాదాపు పదినెలల పాటు నిధులు బ్యాంకులోనే వృథాగా పడి ఉన్నాయి. ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న పాత పోస్టుమార్టం రూంలను కూల్చేసి, అక్కడ టీ డయాగ్నోస్టిక్​ సెంటర్ ​భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు సైతం జీవోలో స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఆలస్యం జరిగి ఫండ్స్​ వాడుకునే గడువు ముగిసింది.

వాట్సాప్ ​ఉంటేనే టెస్ట్ రిపోర్ట్..

ఐటీడీఏ పీవో లేఖ తర్వాత పరికరాల కొనుగోలుకే నిధులు ఉపయోగించాలని సర్కారు తెలిపింది. ప్రత్యామ్నయంగా వేరే భవనం చూసి అందులో టీ డయాగ్నోస్టిక్​ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. భవనం వెతకడంలో ఆఫీసర్లు విఫలమయ్యారు. అంతేకాకుండా వారి నిర్లక్ష్యం కారణంగా టీ డయాగ్నోస్టిక్​ సెంటర్ ను ఏర్పాటు చేయకుండానే వెళ్లిపోయింది. ఇక్కడి ఆసుపత్రికి ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్​గఢ్​, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు చికిత్స కోసం వస్తుంటారు. భద్రాచలం చుట్టు పక్కల ఉన్న పీహెచ్ సీల నుంచి కూడా రోజూ శాంపిల్స్ తీసుకొచ్చి టీ డయాగ్నోస్టిక్​ సెంటర్​ లో టెస్ట్ లు చేయాలి. అనంతరం రోగ నిర్ధారణ చేశాక ఉచితంగా మందులు పంపిణీ చేయాలి. కానీ ఇప్పుడు వీరందరి శాంపిల్స్ ​కొత్తగూడెంలోని టీ డయాగ్నోస్టిక్ ​సెంటర్ కు తీసుకెళ్లి టెస్ట్ లు చేస్తున్నారు. రోగి ఫోన్ కు వాట్సాప్ ​ఉంటే టెస్ట్ రిపోర్ట్స్ పంపుతున్నారు. కానీ ఆదివాసీలకు స్మార్ట్ ఫోన్లు లేక ఇబ్బందిగా మారింది. సంబంధిత పీహెచ్​సీకి రిపోర్టులు వస్తేనే వారికి వివరాలు తెలిసేది. లేకపోతే అంతే సంగతులు. 

అధికారులే బాధ్యత వహించాలి

వచ్చిన నిధులను వాడుకోకపోవడం పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే. గిరిజనులకు ఇది తీరని అన్యాయం. ఇప్పటికే మన్యంలో అనేక రోగాలు తాండవం చేస్తున్నాయి. సకాలంలో రోగ నిర్ధారణ చేస్తే ఆదివాసీలకు సకాలంలో వైద్యం అందుతుంది. 200 పడకల ఏరియా ఆసుపత్రిలో టీ డయాగ్నోస్టిక్​సెంటర్ పెట్టడానికి భవనమే దొరకలేదా?  
- ఎర్రంరాజు బెహరా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి

నిధులు వెనక్కు పోయాయి..

టీ డయాగ్నోస్టిక్​సెంటర్ కోసం రూ.94లక్షలు వచ్చాయి. కానీ జీవోలో స్పష్టంగా చెప్పక పోవడంతో భవనం నిర్మించాలా..? పరికరాలు కొనాలా..? అని నిర్ణయించుకోలేక పో యాం. పీవో సైతం దీనిపై లేఖ రాశారు. స్పష్టత వచ్చే సరికి నిధులు వెనక్కు వెళ్లిపోయా యి. ప్రభుత్వం కూడా జిల్లాకు ఒకటే టీ డయాగ్నోస్టిక్​సెంటర్ అని చెప్పడంతో ఇక అవ కాశం కాస్తా పోయింది. 
– డాక్టర్​రామకృష్ణ, సూపరింటెండెంట్, ఏరియా ఆసుపత్రి