ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ రావడంపై బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయిందని కాంగ్రెస్ నేతలు..బీఆర్ఎస్ , కాంగ్రెస్ కుమ్మక్కయ్యిందని బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
లిక్కర్ స్కాంలో కవిత బెయిల్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్ పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేయడం తగదన్నారు. సంజయ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా భావించి చర్యలు తీసుకోవాలని X వేదికగా సుప్రీంకోర్టును కోరారు కేటీఆర్.
బండి సంజయ్ ఏమన్నారంటే.. లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ ఇప్పించినందుకు కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ అలుపెరుగని ప్రయత్నాలకు ఫలితం లభించిందని సెటైర్లు వేశారు. కవిత బెయిల్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల విజయమన్నారు. కవిత బెయిల్ పై బయటకొస్తే.. కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకువెళ్లారని చెప్పారు. కవిత బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని కాంగ్రెస్ ఏకగ్రీవం చేసి రాజ్యసభకు పంపిందన్నారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతివ్వడంతో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత ప్రదర్శన అని అన్నారు బండి సంజయ్.
Also Read :- కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
మరో వైపు లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ ఊహించిందేనన్నారు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చిందన్నారు. హరీశ్ రావు, కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ల కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని విమర్శించారు.