ఒక్క ఘటనతో అలా ఎలా అంటావ్..? సైఫ్ అలీఖాన్ ఘటనపై ఫడ్నవీస్, కేజ్రీవాల్ మధ్య డైలాగ్ వార్

ముంబై: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‎పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో సెలబ్రెటీలకు నిలయమైన బాంద్రాలో ఉన్న తన నివాసంలో సైఫ్ అలీఖాన్‎పై గుర్తు తెలియని నిందితుడు కత్తితో ఎటాక్ చేశాడు. బుధవారం (జవనరి 15) అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు సైఫ్‎ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సైఫ్ అలీఖాన్ ఆరు కత్తి పోట్లకు గురైనట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‎పై దాడి వార్తతో బాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అయ్యింది. 

అత్యంత సెక్యూరిటీ ఉండే బాంద్రాలో ఏకంగా ఇంట్లోకి చొరబడి సైఫ్ అలీఖాన్‎పై నిందితుడి దాడి చేయడంతో బీ టౌన్ యాక్టర్లలో దెబ్బకు భయం పుట్టుకుంది. ఈ ఘటనతో ముంబైలో సెలబ్రెటీల భద్రతపై మరోసారి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సైఫ్ అలీఖాన్ దాడి ఘటనపై స్పందించిన ఆప్, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్) వర్గాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. మహారాష్ట్రలో లా అండ్ ఆర్డర్ లేదని అదుపులో లేదని.. ఏకంగా సెలబ్రెటీలపైనే దాడులు జరిగితే.. ఇంకా  సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. 

ALSO READ | సైఫ్ పై దాడికి కొద్దిసేపు ముందే పార్టీ నుంచి వచ్చిన భార్య కరీనా..

సైఫ్ అలీఖాన్ ఇన్సిడెంట్‏పై ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘‘గతంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై దాడి జరిగింది. ఇటీవల మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని దుండగులు కాల్చి చంపారు. ఇంత పెద్ద సెలబ్రిటీలకు ప్రభుత్వం భద్రత కల్పించలేకపోతే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి..? డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన, భద్రతను అందించదు’’ అని విమర్శలు గుప్పించారు. సెలబ్రెటీలకు ముంబై సేఫెస్ట్ ప్లేస్ కాదని అన్నారు.

కేజ్రీవాల్ వ్యాఖ్యలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్ ఇచ్చారు. గురువారం (జనవరి 16) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని.. సెలబ్రెటీలపై దాడి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు. అయితే.. ఈ ఒక్క సంఘటన ఆధారంగా ముంబైని సురక్షిత నగరం కాదు అనడం సరికాదని అన్నారు. భారతదేశంలోని అన్ని మెగా సిటీలలో ముంబై అత్యంత సురక్షితమైన నగరమని కేజ్రీవాల్ కామెంట్స్‎కు దేవేంద్ర ఫడ్నవిస్ కౌంటర్ ఇచ్చారు.