- తీగలగుట్టపల్లి ఆర్‌వోబీ, నేషనల్ హైవేపై మాటల యుద్ధం
- సెంట్రల్ ఫండ్స్ క్రెడిట్ తనదేనంటున్న బండి సంజయ్
- ప్రపోజల్స్ నా హయాంలోనే పంపానన్న మాజీ ఎంపీ వినోద్‌కుమార్
- వారిద్దరూ కరీంనగర్‌కు చేసిందేమీ లేదంటున్న మంత్రి పొన్నం
- కరీంనగర్‌లో రేపు దీక్షకు దిగనున్న మంత్రి
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగిన అభివృద్ధిపై సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభివృద్ధి పనుల క్రెడిట్ దక్కించుకునేందుకు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఇదే టైంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగి కరీంనగర్ అభివృద్ధి కోసం సంజయ్, వినోద్‌కుమార్ చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు.
నిధులు నేనే తెచ్చానంటున్న సంజయ్.. ప్రపోజల్స్ నావే అంటున్న వినోద్
గత ఐదేళ్లలో కేంద్రం ఇచ్చిన నిధులన్నీ తానే తీసుకొచ్చానని ఎంపీ బండి సంజయ్ చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్న ఆయన ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావిస్తున్నారు. అయితే ఆ నిధులన్నీ తాను ఎంపీగా ఉన్నప్పుడు పంపిన ప్రపోజల్స్‌తోనే వచ్చాయని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ క్యాండిడేట్ వినోద్‌కుమార్ కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు ఈ ఇద్దరు పదేళ్లలో కరీంనగర్‌కు చేసిందేమీ లేదని, తెలంగాణ విభజన చట్టంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం చేర్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ
హామీలను సాధించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయ్యాయని కాంగ్రెస్ లీడర్లు విమర్శిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడే కరీంనగర్, సిరిసిల్లలో కేంద్రీయ విద్యాలయాలు సాంక్షన్ చేయించారని, కరీంనగర్‌లో 150 బెడ్స్‌తో మాతాశిశు కేంద్రం నిర్మించారని, ఎలగందుల ఖిల్లాను అభివృద్ధి చేశారని, కరీంనగర్‌లో పాస్‌పోర్టు ఆఫీస్ ఏర్పాటు చేయించారని, వేములవాడ, కొండగట్టు, ధర్మపురిని కలిపి టెంపుల్ టూరిజం కారిడార్ ఏర్పాటుకు కృషి చేశారని కరీంనగర్ కాంగ్రెస్ లీడర్లు గుర్తు చేస్తున్నారు.
తీగలగుట్టపల్లి ఆర్‌వోబీ, నేషనల్ హైవే నిధులపై రాద్ధాంతం
కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి ఆర్‌వోబీ నిధుల విషయంలో సిట్టింగ్ ఎంపీ సంజయ్, మాజీ ఎంపీ వినోద్ మధ్య ఎప్పటి నుంచో వివాదం నెలకొంది. తాను ఎంపీగా ఉన్నప్పుడే తీగలగుట్టపల్లిని సిటీలో విలీనం చేయడంతో పాటు ఆర్‌వోబీ శాంక్షన్ అయిందని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ చెబుతుండగా, అసలు ఆర్‌వోబీ మంజూరైందే ఏడాది క్రితం ప్రవేశపెట్టిన ‘సేతు బంధన్ స్కీం’ కింద అని, కరీంనగర్ ఆర్‌వోబీకి రూ.126 కోట్లను కేంద్రం ద్వారా తానే మంజూరు చేయించానని ఇందులో వినోద్ చేసిందేమిటని సంజయ్ ప్రశ్నిస్తున్నారు.
అలాగే కరీంనగర్ నుంచి వరంగల్, ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు ఉన్న జాతీయ రహదారిని ఫోర్‌లేన్‌గా విస్తరించాలని తాను ఎంపీగా ఉన్నప్పుడే లోక్‌సభలో కోరానని ఎంపీ వినోద్‌కుమార్ ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవడంపై బండి సంజయ్ మండిపడుతున్నారు. కరీంనగర్ లోక్‌సభ పరిధిలో ఫోర్‌లేన్ పనులకు కేంద్రం నుంచి రూ.4,877 కోట్ల నిధులు తీసుకొచ్చింది తానేనని, ఈ పనులకు ప్రధాని మోదీ గతేడాది హనుమకొండలో శంకుస్థాపన చేశారని గుర్తు చేస్తున్నారు.
విభజన హామీలపై రేపు మంత్రి పొన్నం దీక్ష
గత పదేళ్లలో బీఆర్ఎస్, బీజేపీ పాలన వైఫల్యాలపై రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన టైంలో ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ ఈ నెల 14న కరీంనగర్‌లో దీక్షకు సిద్ధమయ్యారు. యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో
కేంద్రంలోని బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, హామీలను సాధించుకునేందుకు గత బీఆర్‌ఎస్ సర్కార్ చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. కరీంనగర్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు కోసం పొన్నం ప్రభాకర్ దీక్ష వేదికగా ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు.