కాళేశ్వరం, రేషన్​కార్డులపై మాటల యుద్ధం..అసెంబ్లీలో విజయరమణారావు వర్సెస్​ హరీశ్​ రావు

కాళేశ్వరం, రేషన్​కార్డులపై మాటల యుద్ధం..అసెంబ్లీలో విజయరమణారావు వర్సెస్​ హరీశ్​ రావు
  • అబద్ధాలకు బీఆర్​ఎస్​ నేతలు అలవాటుపడ్డరు: విజయరమణారావు
  • కేసీఆర్​లా మా పార్టీలో ఇంజనీర్లు ఎవరూ లేరని కామెంట్​
  • పదే పదే అడ్డుతగిలిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​​రావు 
  • కాళేశ్వరంలో అదీ మేడిగడ్డలో ఒక్క పిల్లరే కుంగిందని వ్యాఖ్య

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు, రేషన్​ కార్డుల విషయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు, మంత్రి పొన్నం ప్రభాకర్​ మధ్య డైలాగ్​ వార్​ జరిగింది. బీఆర్​ఎస్​ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లలోనే కూలిపోయిందని, వాళ్ల హయాంలో ఒక్క రేషన్​ కార్డు కూడా ఇవ్వలేదంటూ శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్​పై చర్చ సందర్భంగా విజయరమణారావు విమర్శలు గుప్పించారు.

ఈ సమయంలోనే హరీశ్​ రావు పదే పదే కల్పించుకుంటూ విజయరమణా రావు స్పీచ్​కు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. మైక్​ఇవ్వాలని పట్టుబట్టారు. స్పీకర్​ మైక్​ ఇవ్వడంతో ఆ రెండు అంశాలపై హరీశ్​ రావు తన వెర్షన్​ వినిపించారు. 

మూడేండ్లకే మేడిగడ్డ కూలింది: విజయరమణారావు

రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మూడేండ్లకే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందని విజయ రమణారావు అన్నారు. కూలినా.. పగిలినా అది కూలినట్టేనని తెలిపారు. కేటీఆర్​, హరీశ్​ రావులు.. ఎక్కడికిపోయినా కాళేశ్వరం నీళ్లేనని చెప్పేటోళ్లని విమ ర్శించారు. ‘‘మా పార్టీలో కేసీఆర్​లాగా ఇంజనీర్లు ఎవరూ లేరు. మా సీఎం, మా మంత్రులు ఇంజనీర్లు కాదు. నిపుణుల కమిటీపైనే ఆధారపడ్డారు.

.నాడు సీఎంగా ఉన్న కేసీఆరే స్వయంగా తానే ఇంజనీర్​నని చెప్పుకున్నారు. కానీ, మూడేండ్లకే బ్యారేజీ కుంగింది. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మీ హయాం లోనే కుంగింది. ఏ మొహం పెట్టుకుని కేటీఆర్ పాదయాత్ర చేస్తామంటున్నారు. పదేండ్లలో బీఆర్​ఎస్​ వాళ్లు ఒక్క కొత్త రేషన్​ కార్డు ఇవ్వలేదు. గ్రూప్స్​ ఎగ్జామ్స్​ పెట్టలేదు. పెట్టిన ఒక్కసారి వాళ్లే పేపర్​ లీక్​ చేశారు. బీఆర్​ఎస్​ నేతలు అబద్ధాలు చెప్పేందుకు అలవాటు పడ్డారు’’ అని ఆయన మండిపడ్డారు.

ఒక్క బ్లాకులోఒక్క పిల్లరే కుంగింది: హరీశ్​రావు

కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందనే ప్రచారం సరికాదని హరీశ్​ రావు అన్నారు. ‘‘మేడిగడ్డలో ఒక్క పిల్లర్​ కుంగినంతదానికే మామీద కోపంతో కాళేశ్వరం కూలిందని దుష్ర్పచారం చేయడం సరికాదు. మహబూబ్​నగర్​ జిల్లాలో ఇరిగేషన్​ ప్రాజెక్టుల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పడం మంచిది కాదు.

నేను ఇరిగేషన్​ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లాను. అక్కడే నిద్ర చేసి ప్రాజెక్టులను పూర్తి చేసినం. బీఆర్​ఎస్​ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. 20,69,033 మంది కొత్త సభ్యులను చేర్చాం. ఒక్క రేషన్​ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పడం సరికాదు. ఈ విషయాల్లో సభ రికార్డులను సరిచేయాలి’’ అని ఆయన అన్నారు. 

ఒక పిల్లర్​ కూలితే బిల్డింగ్​ నిలబడ్తదా?: మంత్రి పొన్నం

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘ ఒక బిల్డింగ్​లో ఒక పిల్లర్​ కూలిపోతే నిలబడుతుందా?” అని హరీశ్​రావును  ప్రశ్నించారు. మేడిగడ్డలో ఒక పిల్లర్​ మాత్రమే కుంగిందంటూ బీఆర్​ఎస్​ వాళ్లు చెప్పడం కరెక్ట్​ కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ విషయంలో ఏం చేస్తారన్నది సంబంధిత మంత్రి చెప్తారని ఆయన  పేర్కొన్నారు. మేడిగడ్డ కుంగిందంటూ బీఆర్​ఎస్​ వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు.