పాయింట్ ఆఫ్ ఆర్డర్​పై రచ్చ..

పాయింట్ ఆఫ్ ఆర్డర్​పై రచ్చ..
  • సభలో కోర్టు గురించి ఎలా మాట్లాడ్తరు?: హరీశ్ రావు
  • పార్లమెంట్​లో మాట్లాడే అధికారం ఉంటది: మంత్రి ఉత్తమ్​
  • కోర్టుల గురించి రేవంత్ కామెంట్ చేయలేదు: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: పాయింట్ ఆఫ్ ఆర్డర్​పై అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. బీఆర్ఎస్ సభ్యులకు ఎంఐఎం ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. స్పీకర్ పోడియం ఎదుట నిరసన తెలిపారు. కోర్టులపై సభలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడేందుకు అధికారం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘‘కోర్టుల గురించి కూడా సభలో మాట్లాడేందుకు అధికారం ఉంటదని సీఎం రేవంత్ ఎలా చెప్తారు? దీనిపై అప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు అడుగుతున్నాం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడదని సీఎం అన్నారు. గతంలోనూ అనర్హత వేటుపడలేదనే విషయాన్ని రేవంత్ రెడ్డినే గుర్తు చేశారు. సుప్రీం కోర్టులో ఉన్న అంశం గురించి సభలో ఎలా మాట్లాడుతారని మేము నిలదీశాం’’అని హరీశ్ అన్నారు.  

స్పీకర్ పర్మిషన్ ఇస్తే మాట్లాడొచ్చు: మంత్రి ఉత్తమ్

హరీశ్ రావు కామెంట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. పార్లమెంట్​లో సబ్ జ్యుడీస్ విషయాలు సహా ఏవైనా మాట్లాడేందుకు అధికారం ఉంటుందని, స్పీకర్ పర్మిషన్ ఇస్తే మాట్లాడొచ్చని చెప్పారు. తర్వాత మంత్రి శ్రీధర్ బాబు కల్పించుకుని.. ‘‘కౌల్ అండ్ షెక్దార్ గురించి హరీశ్ ప్రస్తావించారు. కానీ.. సీఎం రేవంత్ రెడ్డి కోర్టుల గురించి అసెంబ్లీలో మాట్లాడలేదు.

బీఆర్ఎస్ సభ్యులు మాత్రం పదేపదే దాని గురించి మాట్లాడుతున్నారు. గతంలో వచ్చిన పలు కోర్టు తీర్పుల గురించి మాత్రమే సీఎం ప్రస్తావించారు’’అని శ్రీధర్ బాబు అన్నారు.