డయాలసిస్ సెంటర్లు అందుబాటులో లేక రోగులు తిప్పలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  డయాలసిస్ సెంటర్లు అందుబాటులో లేక రోగులు అనేక తిప్పలు పడుతున్నారు. నియోజకవర్గానికో డయాలసిస్​సెంటర్​ఏర్పాటు చేస్తామని చెప్పిన హెల్త్​మినిస్టర్​హరీశ్ రావు మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. డయాలసిస్​ కోసం రోగులు 60 నుంచి వంద కిలోమీటర్ల వరకు పోయిరావాల్సి వస్తోంది. జిల్లాలోని ఇల్లెందు, పాల్వంచ, అశ్వారావుపేట, మణుగూరు గవర్నమెంట్​హాస్పిటల్స్ లో డయాలసిస్​సెంటర్స్​ఏర్పాటు చేస్తామన్న హామీ నీటి మీద రాతల్లాగే మారింది. 

రాకపోకలకు తిప్పలు..

జిల్లాలోని మారుమూల ప్రాంతమైన గుండాల, ఆళ్లపల్లి, మామకన్ను ప్రాంతాలకు చెందిన రోగులు సుమారు 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం పట్టణాలకు వెళ్లి డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. చర్ల, పినపాక, మణుగూరు ప్రాంతాలకు చెందిన రోగులు భద్రాచలంతోపాటు ఖమ్మం వెళ్లాల్సి వస్తోంది. వారానికి రెండు నుంచి నాలుగు సార్లు అంత దూరం రాకపోకలు సాగించే సరికి ప్రాణం పోతుందని పలువురు రోగులు వాపోతున్నారు. డయాలసిస్​రోగుల అవస్థలను గమనించి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్, వైద్యాధికారులు ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ, అశ్వారావుపేట గవర్నమెంట్​హాస్పిటల్స్ లో డయాలసిస్​సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపారు. ఈ క్రమంలో ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, అశ్వారావుపేటకు డయాలసిస్​సెంటర్లు మంజూరు చేస్తున్నట్టు హెల్త్​మినిస్టర్​ప్రకటించి ఆర్నెళ్లైంది. వెంటనే సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాలోని డయాలసిస్ రోగులు సంబరపడ్డారు. అయితే ఇప్పటికీ వాటి ఏర్పాటుపై అతీ గతీ లేదు. దీంతో రోగులు ఎప్పటిలాగే ఇబ్బందులు పడుతున్నారు. 

కొత్త సెంటర్లలో ఏర్పాట్లు కష్టమే..!

హెల్త్​మినిస్టర్​ఆదేశాల ప్రకారం కొత్త సెంటర్లు ఏర్పాటు చేస్తే వాటిలో సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. వీటి కల్పనే ఓ పెద్ద సవాల్. ఒక్కో డయాలసిస్ సెంటర్లో దాదాపు10వేల లీటర్ల కెపాసిటీతో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. డయాలసిస్ చేసే క్రమంలో వేస్టేజ్​పోయేందుకు అవసరమైన డ్రైనేజీ సిస్టం లేదు. కరెంట్ పోతే జనరేటర్ లను కూడా ఏర్పాటు చేయాలి. ఇవే కాకుండా 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్​పెట్టాలి. జిల్లాలోని ఎమ్మెల్యేలు హెల్త్​మినిస్టర్ పై ఒత్తిడి తీసుకువస్తేనే డయాలసిస్ సెంటర్లు త్వరగా ఏర్పాటయ్యే అవకాశం ఉందని డయాలసిస్ రోగులు అంటున్నారు. 

రోగి చస్తేనే మరొకరికి ఛాన్స్...

జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్​జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)​​తోపాటు భద్రాచలంలోని గవర్నమెంట్​హాస్పిటల్​లో డయాలసిస్​ సెంటర్లున్నాయి. కొత్తగూడెం జీజీహెచ్​లో డయాలసిస్​కు కేవలం ఐదు బెడ్స్, భద్రాచలంలో10బెడ్స్​మాత్రమే ఉన్నాయి. వీటిల్లో దాదాపు130 మంది రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీరు కాకుండా దాదాపు మరో 50 మందికి పైగా రోగులు వెయిటింగ్ లిస్ట్​లో ఉన్నారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ లో ఉన్న రోగి చనిపోతేనే మరో వ్యక్తికి అవకాశం ఇస్తారు. బెడ్స్​ఎప్పుడు ఖాళీ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. వీరే కాకుండా మరికొంత మంది ప్రైవేట్​హాస్పిటల్స్​లో రూ.వేలల్లో డబ్బులు వెచ్చిస్తూ ట్రీట్మెంట్​తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు వారానికి కనీసం రెండు నుంచి నాలుగు సార్లు డయాలసిస్​సెంటర్​కు వచ్చి రక్త శుద్ధి చేసుకోవాల్సి ఉంది. 

ఇల్లెందులో ఏర్పాటు చేయాల్సిందే..

ఇల్లెందు గవర్నమెంట్ హాస్పిటల్ లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తే గుండాల, టేకులపల్లి, ఆళ్లపల్లి, కారేపల్లి మండలాల పరిధిలోని రోగులకు సౌకర్యంగా ఉంటుంది. వారానికి మూడుసార్లు డయాలసిస్​కోసం ఖమ్మం వెళ్లే వచ్చే సరికి ప్రాణాలు పోతున్నాయి. ప్రజాప్రతినిధులు, కలెక్టర్​ స్పందించి త్వరంగా చర్యలు తీసుకోవాలి. 
– సిద్దార్థ్, డయాలసిస్​పేషెంట్, ఇల్లెందు

నరకం అనుభవిస్తున్నా...

వారానికి నాలుగు సార్లు డయాలసిస్ కోసం కొత్తగూడెం హాస్పిటల్​కు వచ్చి పోతున్నా. ట్రీట్మెంట్ కోసం నాలుగు గంటలు బెడ్ మీదనే పడుకోవాలి. రోజుకు లీటర్ కన్నా నీళ్లు ఎక్కువగా తాగే అవకాశం లేదు. రావడం ఆలశ్యమైతే మరోకరు బెడ్​ను ఆక్రమించుకుంటున్నారు. ఆ పరిస్థితి చెప్పలేకుండా ఉంటుంది. 
– లాల్​సింగ్, డయాలసిస్ పేషెంట్, తడికలపూడి