- రెండేండ్లుగా మెయింటెనెన్స్ ఫండ్స్ రావట్లే
- పేరుకుపోయిన రూ.1.50కోట్ల బకాయిలు
- గాలివానతో ఆసుపత్రిలో 30 గంటలపాటు పవర్ లేదు..
- వైద్య సేవలకు ఆటంకం.. నీళ్లు రాక పేషెంట్ల అవస్థలు
- గత బీఆర్ఎస్ సర్కార్ పాపం.. రోగులకు శాపం
- జిల్లా మంత్రులు పట్టించుకోవాలని స్థానికుల విజ్ఞప్తి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కరెంట్‌పోతే భద్రాద్రికొత్తగూడెం జిల్లా జనరల్ హాస్పిటల్లో డయాలసిస్ సేవలు బంద్ చేయాల్సి వస్తోంది. రెండేండ్లుగా మెయింటెనెన్స్ ఫండ్స్ రాకపోవడంతో ఆసుపత్రిలో కనీసం డీజిల్‌కు కూడా కొనలేకపోతున్నారు. మొన్నటి గాలివానకు ఆసుపత్రి అంతా ఆగమాగమైంది. పేషెంట్లు అవస్థలు పడ్డారు.
ఫండ్స్ రాక.. సమస్య పరిష్కారం కాక..
హాస్పిటల్ మెయింటెనెన్స్ ఫండ్స్‌ను రెండేండ్లుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా ఇవ్వలేదు. దీంతో బకాయిలు దాదాపు రూ. 1.50కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. 100 బెడ్స్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్‌ను మెడికల్ కాలేజ్‌కు అనుబంధంగా 230 బెడ్స్‌తో జిల్లా జనరల్ హాస్పిటల్‌గా మార్చామంటూ బీఆర్ఎస్ పాలకులు గొప్పలు చెప్పుకున్నారు. కానీ సౌలతులు కల్పించడం మర్చిపోయారు. దీంతో ఒక గాలివానకే ఆగమాగం కావాల్సి వస్తోంది. ఫండ్స్ లేక ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఇతర పరికరాలు కొనలేని దుస్థితి.
కనీసం కరెంట్ పోతే జనరేటర్‌కు డీజిల్ తేవడం లేదు. ఎమర్జెన్సీకి ఏదో మినిమం డీజిల్‌ను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం గాలివానలు వరుసగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఎన్నో ఇబ్బందులు తప్పవని పలువురు హెచ్చరిస్తున్నారు. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో మందులకు మెడికల్ షాప్‌తో పాటు డీజిల్‌కు బంక్‌ల యాజమానులు మొఖం చాటేస్తున్నారని డాక్టర్లు పేర్కొంటున్నారు.
ఆఫీసర్ల తీరుపై అసహనం..
కొత్తగూడెం పట్టణం నడిబొడ్డున విద్యుత్ శాఖ ఆఫీస్, దాని దగ్గరలోనే గవర్నమెంట్జనరల్ హాస్పిటల్ ఉంది. ఆదివారం రాత్రి గాలి వానతో హాస్పిటల్‌తో పాటు పలు ప్రాంతాల్లో కరెంట్ స్తంభాలు విరిగిపోయాయి. ఎమర్జెన్సీ సర్వీస్ కింద హాస్పిటల్లో కరెంట్‌ను పునరుద్ధరించాల్సి ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ ఆఫీసర్లు మాత్రం పట్టించుకోలేదు. సోమవారం రాత్రి ఎమ్మెల్యేతో పాటు మీడియా, రోగులు సీరియస్ కావడంతో అప్పటికప్పుడు కొత్త కరెంట్ పోల్స్ వేసి విద్యుత్ సప్లైని పునరుద్ధరించారు. అయితే విరిగిన స్తంభాల స్థానంలో కొత్త పోల్స్ వేసేందుకు అవసరమైన మిషనరీలు కొత్తగూడెం
లక్ష్మీదేవిపల్లి మండలాల్లో దాదాపు 15 వరకు ఉన్నాయి. కానీ ఒక కాంట్రాక్టర్‌తో మిలాఖత్ అయిన విద్యుత్ శాఖాధికారులు గొయ్యి తీసే పనిని ఆయనొక్కరికి అప్పగించడంతో కరెంట్ పోల్స్ ఏర్పాటులో డిలే జరిగినట్లు తెలుస్తోంది. పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నా ఆఫీసర్లు మాత్రం నిర్లక్ష్యం వీడకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లా ముగ్గురు మంత్రులు, కలెక్టర్ స్పందించి ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
పేషెంట్లకు తప్పని తిప్పలు
కొత్తగూడెంలో ఆదివారం రాత్రి గాలివానకు పట్టణంలోని కరెంట్ పోల్స్ విరిగాయి. దీంతో జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దాదాపు 30 గంటల పాటు కరెంట్ సప్లయ్నిలిచిపోయింది. హాస్పిటల్‌లోని డయాలసిస్ పేషెంట్స్‌ను డాక్టర్లు ఇండ్లకు పంపించారు. మధ్యలో ఏమైనా జరిగితే తమ ప్రాణం పోవాల్సిందేనా.. అంటూ డయాలసిస్ పేషెంట్లు సోమవారం రాత్రి మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.
ఆక్సీజన్ సప్లై నిలిచిపోవడంతో ఎమర్జెన్సీ కేసులు చూడలేని పరిస్థితి నెలకొంది. నీళ్లు లేక పేషెంట్లు, వారి వెంట వచ్చినవాళ్లు నానా అవస్థలు పడ్డారు. ఇతర సేవలు అందించడంలోనూ ఇబ్బంది తప్పలేదు. గంటలపాటు కరెంట్ సప్లై నిలిచిపోయినా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాత్రం అందుబాటులోకి రాలేదు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వచ్చి పోయిన తర్వాత ప్రిన్సిపాల్ రావడంపై పలువురు మండిపడుతున్నారు.