హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ సైట్ 2లో భారీ చోరీ జరిగింది. ఆభరణాల తయారీ సంస్థలో విలువైన వజ్రాలు, బంగారం చోరీకి గురైంది. ఫిలింనగర్ లో పవన్ కుమార్ అనే వ్యక్తి శమంతక డైమండ్స్ షాపు నిర్వహిస్తున్నాడు. గుజరాత్ లోని సూరత్ నుంచి బంగారం ముడి సరుకు తీసుకువచ్చి..ఆర్డర్స్ పై ఆభరణాలు తయారు చేయించి ఇస్తుంటాడు.
యజమాని పవన్ మంగళవారం రోజు గోల్డ్ షాపుకు తాళం వేసి..బంగారం ముడి సరుకును లాకర్ లో పెట్టి వెళ్లాడు. నిన్న షాపుకు వచ్చి లాకర్ ను ఓపెన్ చేసి చూసేసరికి బంగారం ముడి సరుకు కనిపించలేదు. దీంతో కంగారుపడిన పవన్.. షాపులో అన్ని చోట్ల వెతికాడు. చివరకు బంగారం ముడి సరుకు చోరీకి గురైందని గుర్తించాడు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు బాధితుడు పవన్ సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనలో కోటి రూపాయల విలువ చేసే డైమండ్స్, ముడి సరుకు చోరీకి గురైనట్లు పవన్ కుమార్ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.